‘లైగర్’ తో నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు పూరి, ఛార్మిలు నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం డిస్టిబ్యూటర్లందరితోనూ మాట్లాడుతున్నారు. ఎవరెవరికి ఎంత తిరిగి ఇవ్వాలి? ఏ రూపంలో ఈ వ్యవహారం సెటిల్ చెయ్యాలి? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఈలోగా తన పారితోషకం నుంచి విజయ్ దేవరకొండ రూ.6 కోట్లు తిరిగిచ్చాడన్న ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. దాంతో ఈ సినిమాతో నష్టపోయిన వాళ్లంతా పూరి, ఛార్మిలపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారట. విజయ్ రూ.6 కోట్లు ఇచ్చాడు కదా, మా వ్యవహారం కూడా వీలైనంత త్వరగా తేల్చేయమంటున్నార్ట. అయితే… విజయ్ తన పారితోషికం నుంచి పైసా కూడా తిరిగి ఇవ్వలేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘లైగర్’ రిజల్ట్ బయటకు వచ్చిన తరవాత.. విజయ్ పూర్తిగా తన సొంత పనుల్లో పడిపోయాడని, కనీసం పూరి, ఛార్మిలకు కూడా టచ్లో లేడని తెలుస్తోంది. ‘జనగణమన’ని ఆపేద్దాం.. అనే విషయంలోనే పూరి, ఛార్మి, విజయ్ మధ్య చర్చలు జరిగాయని, ఆ సమయంలో `లైగర్` పారితోషికం గురించి గానీ, నష్టంలో కొంత భాగం విజయ్ భరించే విషయంలో గానీ, ఎలాంటి మాటలూ ఇచ్చి పుచ్చుకోలేదని సమాచారం. పూరి కూడా.. ఈ నష్టం మొత్తం తనే భరించాలని డిసైడ్ అయ్యాడట. ‘ఇస్మార్ట్ శంకర్’ లాభాలతో హైదరాబాద్లో పూరి ఓ ప్రాపర్టీని కొన్నాడు. ఇప్పుడు అది అమ్మేసి, ఆ డబ్బుల్ని డిస్టిబ్యూటర్లకు పంచాలని భావిస్తున్నాడట. ఇందులో.. విజయ్ వాటా ఏమాత్రం లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.