జనసేనను బీజేపీ అసలు పట్టించుకోడం లేదు. కేంద్ర నేతలు అసలు జనసేన అనే పార్టీ తమతో పొత్తులో ఉందని కూడా లెక్కలోకి తీసుకోవడం లేదు. రాష్ట్ర నేతలు అయితే అదే పనిగా జనసేనను అవమానిస్తున్నారు. పొత్తు ఉందని.. జనసేనతోనే కలిసి ముందుకెళ్తామంటారు. కానీ 175 స్థానాల్లో పోటీ చేస్తామంటారు. ఎలా సాధ్యమని ఇతరులు కామెడీ చేస్తున్నారు కానీ.. అంతర్గతంగా జనసేనను బీజేపీలో విలీనం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఈ కారణంగాని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు.
జనసేనను విలీనం చేస్తేనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామనే ప్రతిపాదన
పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ జనసేనవర్గాల నుంచి వచ్చింది. కానీ బీజేపీ అందుకు అంగీకరించలేదు. నిజానికి పవన్ లాంటి స్టామినా ఉన్న నాయకుడు బీజేపీలో లేరు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో పవనే సీఎం అభ్యర్థి అని ప్రకటించారు కూడా. కానీ తర్వాత మాట మార్చేశారు. నిజానికి ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేసినా కనీస మాత్రం అయినా సీట్లు వస్తాయో లేదో చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ అంగీకరించలేదు. అప్పుడు కూడా జనసేనను విలీనం చేస్తేనే అని షరతు పెట్టినట్లుగా చెబుతున్నారు.
పవన్ ఒంటరిగా ఏమీ చేయలేరని నిరూపించడానికే బీజేపీ నిర్లక్ష్యం !
బీజేపీ చాలా కాలంగా జనసేనను తమ పార్టీలో విలీనం కావాలని కోరుతోంది. పవన్ కల్యాణ్ కూడా చాలా సార్లు ఇదే మాట చెప్పారు. కానీ పవన్ మాత్రం తాను విలీనం చేయనని పార్టీని నడుపుతానని అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్.. ఒంటరిగా ఏమీ చేయలేరని.. ఆయనను ఆశక్తుడ్ని చేయాలన్నట్లుగా బీజేపీ తీరు ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్టీని నడపలేని సమయంలో ఆయనే పార్టీని విలీనం చేస్తారని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ నిర్వీర్యం చేసే దిశగా వ్యూహాలు అమలు పరిచారని అంటున్నారు.
పవన్‌కు విలీనం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా?
బీజేపీ రాజకీయాలు ఇంతే ఉంటాయి. పొత్తులు పెట్టుకున్న పార్టీలను నిర్వీర్యం చేయడం .. తమలో కలిపేసుకోవడం ఆ పార్టీ లక్ష్యాల్లో ఒకటి ఇప్పుడు పవన్ కల్యాణ్.. ఆ పార్టీ గుప్పిట చిక్కారు. విలీనం అవుతారో.. ఎలా బయటకు వస్తారో చూడాల్సి ఉంది.