ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఎఫ్ఐఆర్ దగ్గరే ఉంది. ఈ లోపు ఈడీ కూడా రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ఒక్క సారే పలు చోట్ సోదాలు ప్రారంభించారు ఢిల్లీ, లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఏకంగా ముఫ్పై చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఈ స్కాం ప్రకంపనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఉన్న రామచంద్ర పిళ్లై తో పాటు బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్రప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం ఢిల్లీకే పరిమితం కాలేదు. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయంలోనూ కలకలం రేగడానికి కారణం అవుతోంది. కవిత పేరు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే తనపై ఆరోపణలు చేయకుండా ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. మరో వైపు ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి పేరు కూడా ఉందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాజకీయదుమారం కొనసాగుతోంది.
సీబీఐ ఈడీ విచారణలతో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో మద్యం లిక్కర్ సిండికేట్ల తరపున డిపాజిట్ కట్టిన విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిపై ఈడీ దాడులు జరగడం లేదని తెలుస్తోంది. అందుకే ఈ విషయంలో భిన్నమైన రాజకీయాలు.. చర్చల్లోకి వస్తున్నాయి.