అదేంటో గానీ… ఈమధ్య ప్రెస్ మీట్లు కాస్త కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలుస్తున్నాయి. కొన్ని ప్రశ్నలు సెలబ్రెటీలకు చిరాకు తెపిస్తే.. ఇంకొన్ని సమాధానాలు మీడియాకు కిర్రెక్కిస్తున్నాయి. ఆమధ్య ‘లైగర్’ ప్రెస్ మీట్ లో ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. పాత్రికేయుల సమక్షంలో విజయ్ చేసిన ఓవరాక్షన్.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు మీడియాపై రెజీనాకు కోపం వచ్చింది. ఓ ప్రశ్నకు అసహనానికి గురైంది.
రెజీనా నటించిన ‘శాకిని డాకిని’ ప్రెస్ మీట్ ఈరోజు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఇందులో రెజీనా ఓసీడీ (అతి శుభ్రత)తో ఇబ్బంది పడే పాత్ర పోషించింది. దాంతో ఓ పాత్రికేయుడు ‘మీక్కూడా ఓసీడీ ఉందా’ అంటూ క్యాజువల్ గా ఓ ప్రశ్న సంధించాడు. దాంతో రెజీనా అసహనానికి గురైంది. ‘మీ దగ్గర ఇంతకు మించి ప్రశ్నలేం లేవా..’ అని ఆ రిపోర్టర్ మొహం మీదే అడిగేసింది. ఓసీడీ అనేది ఓ వ్యాధి అని.. ఈ ప్రశ్న ఓ హీరోని అడగ్గలరా? అంటూ క్వశ్చన్ చేసింది. నిజానికి ఈ తరహా ప్రశ్నలకు చాలా సింపుల్ గా సమాధానం చెప్పేస్తుంటారు. కానీ రెజీనా మాత్రం కాస్త ఓవరాక్షన్ చేసినట్టు కనిపించింది. ఈ ప్రశ్నకే కాదు. ప్రెస్ మీట్లో తరచూ పాత్రికేయుల సెల్ ఫోన్ రింగ్ అయినప్పుడు కూడా ఇలానే ఇబ్బంది పడింది. ‘మీరు ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకోరా..’ అంటూ అడిగేసింది. అయితే.. ఆ ఇబ్బంది కనిపించకుండా మొహంమీద చిరునవ్వు తెచ్చుకొన్నందుకు మీడియా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఓసీడీ ప్రశ్నకు మాత్రం రెజీనా ఇలా స్పందించడం కాస్త చర్చనీయాంశం అవుతోంది. మీడియా ఇంట్రాక్షన్లకు సెలబ్రెటీలు ఎప్పుడూ చెప్పిన టైమ్ కు రారు. ఈ ప్రెస్ మీట్ కూడా దాదాపు రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. ఇదే విషయం రెజీనాని అడిగితే.. ఆమె దగ్గర సమాధానం ఉంటుందా..?