సీపీఎస్ ఉద్యో సంఘ నేతలను కేసులతో భయపెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. చర్చల్లో ఎలాంటి పురోగతి ఉండదని తెలిసినా బొత్స, బుగ్గన నేతృత్వంలోని కమిటీ తరచూ ఉద్యోగ సంఘ నేతలను చర్చలకు పిలుస్తున్నారు. వారు అడుగుతున్నట్లుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయబోమని.. జీపీఎస్ అమలు చేస్తామని అంగీకరించాలని పట్టుబడుతున్నారు. సీపీఎస్ రద్దుపై మాత్రమే చర్చలకు వస్తామని వారు ఖరాఖండిగా తేల్చి చెప్పి బయటకు వచ్చేశారు. కానీ ఈ మీటింగ్‌ల వెనుక వేరే వ్యూహం ఉందని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం రేపు కేబినెట్ సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో సీపీఎస్‌కు బదులుగా అమలు చేయాలనుకుంటున్న జీపీఎస్‌కు ఆమోద ముద్ర వేసి.. వెంటనే అసెంబ్లీలో ఆమోదించాలనుకుంటున్నారు. అదే జరిగితే ఉద్యోగులు శాశ్వతంగా నష్టపోతారు. ఇలా చేయడానికే ఉద్యోగ సంఘాల నేతలపై కేసు కత్తి వేలాడదీశారు. ఇటీవల ఎవరూ చలో విజయవాడకు రాకపోయినా.. ఉద్యోగ సంఘాల నేతలందరిపై కుట్ర కేసులు పెట్టారు. దీంతో వారందరికీ అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తమపై పెట్టిన తప్పుడు కేసులు తొలగించాలని వారు కోరుతున్నారు. డీజీపీని కలుస్తామని చెబుతున్నారు. అయితే ఆ కేసులు తీసేయాలంటే.. సీపీఎస్ రద్దు డిమాండ్ చేయకూడదని.. జీపీఎస్ కు అంగీకరించాలని షరతును పరోక్షంగా పంపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు లొంగిపోతే.. ప్రభుత్వం చిన్న చిన్న నిరసనలతో అనుకున్నట్లుగా జీపీఎస్ అమలు చేసేస్తుంది.