ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఉద్యోగుల జీతాలు వాయిదాల వారీగా ఇస్తోంది. ప్రతి మంగళవారం ఆర్బీఐలో బాండ్లు వేలం వేసి వచ్చినంత ఇస్తోంది. దాదాపుగా ప్రతీ నెలా ఇలాగే చేస్తున్నప్పటికీ ఈ పరిస్థితి భిన్నం. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితి పూర్తయిపోయింది. మద్యం బాండ్ల విక్రయాల వివరాలు చెప్పలేదని కేంద్రం ఆ పరిమితిని దాచి పెట్టి అధికంగా అప్పులు తీసుకోవడానికి సహకరించింది. ఇక వచ్చే నెల నుంచి అప్పులకు అవకాశం లేదు. అయితే కేంద్రం చాన్స్ ఇస్తే మాత్రం అప్పులు పుడతాయి. బండి నడిచిపోతుంది.
ఏపీ ప్రభుత్వం లెక్కలు చెప్పకుండానే వేల కోట్ల అప్పులు చేస్తోంది. నిరంతరాయంగా ఈ అప్పుల ప్రవాహం గత రెండున్నరేళ్లుగా సాగుతోంది. కేంద్రం ఇంకేమీ అడగడం లేదుగా అప్పులేగా అన్నట్లుగా ఇస్తూ పోతోంది. ఈ అప్పుల దెబ్బకు ఆదాయం మొత్తం వడ్డీలు.. అసలుకే రరిపోయే పరిస్థితి వచ్చింది. నెలకు రూ. ఐదు వేల కోట్ల వరకూ వడ్డీలు, అప్పులుకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ సొంత ఆదాయం కూడా అంతే మొత్తం ఉంటుంది. ఇక ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.
అయితే చేస్తున్న అప్పులన్నీ నిరర్థక ఖర్చులు కావడంతో ఏపీ సర్కార్ ఆదాయం పెద్దగా పెరగడం లేదు. ద్రవ్యోల్బణంతో పాటు ధరలు పెరుగుతున్నాయి… కానీ ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదు. కేవలం ఒక్క మద్యం విషయంలోనే ఆ పురోగతి ఉంది. వేల కోట్లు వస్తున్నాయి. కానీ వీటిని కూడా ముందుగానే తనఖా పెట్టి లోన్లు తీసుకున్నారు. వచ్చే ఆదాయం అంతే ప్రభుత్వానికి రావడం లేదు. నేరుగా అప్పలిచ్చిన వారి ఖాతాకే పోతోంది.
ఇప్పుడు బ్యాంకులు అప్పులివ్వడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. అందుకే బాండ్ల మార్గం ఎంచుకన్నారు. కేంద్రం సహకరిస్తోంది. ఇక నుంచి సహకరిస్తుందా అన్న సందేహం ఉంది. ఆర్బీఐ ఇచ్చిన పర్మిషన్ మేరకు అప్పుల కోటా పూర్తయింది. వచ్చే రెండు, మూడు నెలలు ఇతర అప్పుల నుంచి నెట్టుకు రావాలి. అది కేంద్రం సహకరిస్తేనే సాధ్యమవుతుంది. కేంద్రం చల్లని చూపు ఉంటే.. నడుస్తుంది లేకపోతే.. ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.