ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు చేయవద్దని కల్వకుంట్ల కవిత కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నారు కానీ బీజేపీ నేతలు మాత్రం ఆగడం లేదు. తెలంగాణలో ఈడీ సోదాలు జరిపిన రామచంద్ర పిళ్లై, సూదిని సృజన్ రెడ్డి, బోయినపల్లి అభిషేక్ రావు ఎవరో తనకు తెలియదని కవిత ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓ ఫోటో విడుదల చేశారు. కవిత తన సోదరి అని.. ఆమెపై వ్యక్తిగత కక్ష లేదంటూనే..ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటో తిరుమలలో కుటుంబసభ్యులతో కవిత దిగిన ఫోటో.
అందులో ఉన్న వారి గురించి రఘనందన్ రావు వెల్లడించారు. వారిలో ఓ వైపు సూదిని సృజన్ రెడ్డి, మరో వైపు రామచంద్ర పిళ్లై ఉన్నారు. వారి కుటుంబాలతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున కవిత కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది. అసలేమీ తెలియకపోతే ఎలా కుటుంబాలతో సహా వెళ్లి దర్శనం చేసుకున్నారని…రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. సృజన్ రెడ్డి జైపాల్ రెడ్డి కుటుంబానికి చెందినవారు.
అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా దగ్గర బంధువని రఘునందన్ రావు చెబుతున్నారు. వాళ్లెవరో తెలియదని కవిత అన్నారు కాబట్టే తాను ఫోటో విడుదల చేస్తున్నానని రఘునందన్ రావు ప్రకటించారు.ఈ అంశంపై కవిత స్పందిస్తారో లేదో కానీ.. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కవిత తో పాటు ఏపీ సర్కార్ పెద్దలకూ ముందు ముందు చిక్కులు తప్పవన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.