బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్న సామెత చందంగా తయారయింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిస్థితి. 70 లక్షల రూపాయల ఖరీదైన వాచీని ఇష్టంగా ధరిస్తున్నందుకు ఆయన ఇప్పుడు నానా పాట్లు పడాల్సి వస్తోంది. వాచీని ఆయన ప్రభుత్వానికి సమర్పించుకుని, వదిలించుకున్నారు గానీ.. దాన్ని కానుకగా స్వీకరించడానికి సంబంధించిన వివాదం మాత్రం ఆయనను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. నిను వీడని నీడను నేనే అన్నట్లుగా ఆయనను అంటిపెట్టుకునే తిరుగుతోంది.
మిత్రులు కానుకలు ఇచ్చినప్పుడు వద్దనలేం. రాజకీయాల్లోనూ, పైగా పదవుల్లోనూ ఉన్నప్పుడు అలాంటి కానుకలు చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. పైగా మిత్రులు కొత్తగా ఏర్పడుతూ.. కొంగొత్త కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. కాకపోతే సీఎం సిద్దరామయ్య విషయంలో కొత్త మిత్రులు కాకపోయినా.. ఆయన వెల్లడించిన ప్రకారం.. దుబాయిలో తన పాత మిత్రుడు తనను కలిసిన సందర్భంలో అతని చేతికి ఉన్న ఖరీదైన వాచిని తనకు ఇచ్చేశాడంటూ వ్యాఖ్యానించారు.
అయితే అసలు ఈ ఖరీదైన వాచీ గురించి ఆరోపణలు గుప్పించి సంచలనం సృష్టించిన మాజీ సీఎం కుమారస్వామి.. ఇప్పుడు కొత్త బాంబు పేల్చడం విశేషం. అసలు ఆ వాచీ ఎన్నారై డాక్టర్ సుధాకర్శెట్టి ఇంట్లో 2015లో చోరీకి గురైన సొత్తు అని మాజీ సీఎం చెప్పడం మరో సంచలనం. అంటే చోరీ సొత్తును ఎవరో కొని ముఖ్యమంత్రికి కానుకగా ఇచ్చి.. ఆయనను ఇంప్రెస్ చేశారా? అనే కొత్త అనుమానాలు ఇప్పుడు ముసురుకుంటున్నాయి. వాచీకి సంబంధించిన వివాదం ఒక పట్టాన కొలిక్కి రాకపోతుండడంతో.. సిద్ధరామయ్య పదేపదే సంజాయిషీలు చెప్పుకోలేక సతమతం అయిపోతున్నారు.
అందుకే అసలు వివాదానికి మూలమైన ఆయన వాచీ పోయింది గానీ.. ఈ గొడవలతో ఆయనకు తల బొప్పికట్టి వాచిపోతున్నదంటూ జనం నవ్వుకుంటున్నారు.