అసెంబ్లీ సమావేశాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా లైట్ తీసుకుంటున్నాయి. ఖచ్చితంగా సమావేశపర్చాల్సిన టైమ్‌కు సమావేశపర్చి.. ఒకటి రెండు రోజులు నిర్వహించి మ మ అనిపిస్తున్నాయి. అటు ఏపీ .. ఇటు తెలంగాణ రెండు ప్రభుత్వాలూ అంతే. ఏపీలో అయితే విచిత్రంగా బడ్జెట్ సమావేశాలనూ ఒక్క రోజే నిర్వహించిన రికార్డు ఉంది. అసెంబ్లీలో చర్చలు జరిగితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ప్రభుత్వాలు ఇలా చర్చలు జరపడానికి ఆసక్తి చూపించడం లేదు.
తెలంగాణ ప్రభుత్వం ఈ పధ్నాలుగో తేదీ లోపు సభను సమావేశపర్చాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో సమావేశ పర్చాల్సి ఉంటుంది. ఈ కారణంగా వెంటనే ఓ రోజు సమావేశపర్చి వారానికి వాయిదా వేశారు. ఆ తరవాత మరో రెండు రోజులు మాత్రమే సభను మొక్కుబడిగా నిర్వహిస్తారు. దాంతో వర్షాకాల సమావేశాలు పూర్తయిపోయినట్లవుతాయి. ఏపీలోనూ అంతే రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన చివరి గడువు వచ్చే టప్పటికీ సమావేశపర్చి.. నాలుగైదు రోజులుసభ నిర్వహించి అయిపోయిందనిపిస్తారు.
నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు తిరిగులేనంత మెజార్టీ ఉంది. తమ వాదన బలంగా వినిపించుకునే అవకాశం ఉంది. కానీ రెండు చోట్ల ఉన్న కొద్ది పాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేల వాదన కూడా వినకూడదన్నట్లుగా తీరు ఉంటుంది. అధికార పక్ష సభ్యులు బూతులతో విరుచుకుపడే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ప్రధాన బాధ్యత చట్టసభల చర్చల్లో పాల్గొనడం. కానీ ప్రభుత్వాలే ఇప్పుడు చట్టసభలకు ప్రాధాన్యం తగ్గించేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి శోభనివ్వదు.