Captain movie telugu review
తెలుగు360 రేటింగ్ : 2/5
సెన్స్‌కి అందని వింతలూ విశేషాల గురించి ఎప్పుడూ ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. ఏలియన్స్ గురించి ఎవరేం చెప్పినా వింటాం. ఎందుకంటే… మానవ మేధస్సుకి అందని అంశం అది. ఏదైనా ఓ వింత జీవి… భూమ్మీదకు ఎటాక్ చేస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్ తో హాలీవుడ్ లో బోలెడు సినిమాలొచ్చాయి. వాటన్నింటి యునిక్ సెల్లింగ్ పాయింట్… ప్రేక్షకుడిలోని ఆ క్యూరియాసిటీనే. భారతీయ తెరపైనా, అందునా దక్షిణాదిన ఈ తరహా పాయింట్ ఎవరూ ముట్టుకోలేదు. మొదటిసారి ఆర్య ఆ ప్రయత్నం చేశాడు.. ‘కెప్టెన్’తో. అడవిలో మాటు వేసి మరీ దాడి చేసే ఓ వింత జీవి నేపథ్యంలో సాగిన సినిమా ఇది. మరి.. ‘కెప్టెన్’ ఎలా ఉన్నాడు? ఆ వింత జీవి విన్యాసాలేంటి?
సెక్టార్ 43 అనే అటవీ ప్రాంతం. అది నో ఫ్లయింగ్ ఏరియా. అక్కడ ఓ బృందం వెళ్తుంది. ఆ గ్రూప్‌లోని సభ్యుడే మిగిలిన వాళ్లని చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు సెక్టార్ 43లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కెప్టెన్ విజయ్ కుమార్ (ఆర్య) తన టీమ్ తో కలిసి వెళ్తాడు. ఈసారీ అదే జరుగుతుంది. ఓ వింత జీవి… ఈ బృందంపై ఎటాక్ చేస్తుంది. టీమ్ లోని కార్తి… తన టీమ్ సభ్యులపై కాల్పులు జరిపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. కార్తిపై దేశ ద్రోహి ముద్ర పడుతుంది. కానీ విజయ్‌కి కార్తిపై నమ్మకం. తానెప్పుడూ ద్రోహం చేయడని బలంగా విశ్వసిస్తాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి, మిగిలిన వాళ్లపై కాల్పులు జరపడానికి ఓ బలమైన కారణం ఉందని నమ్ముతాడు. దాన్ని విజయ్ ఎలా సాల్వ్ చేశాడు.. అసలు ఆ అడవిలో ఉన్న వింత జీవి కథేమిటి? ఆ వింత జీవి చుట్టూ ఏం జరుగుతోంది? అనేదే మిగిలిన కథ.
హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే చూశారు జనాలు. మనకైతే కొత్త కాన్సెప్ట్ అనుకోవాలి. ఓ అడవిలో ఓ వింత జీవి సంచరించడం, అక్కడకు వెళ్లినవాళ్లంతా చనిపోవడం అనే ఎపిసోడ్ తో కథని ఆసక్తికరంగా మొదలెట్టాడు దర్శకుడు కెప్టెన్‌కీ తన టీమ్ కి ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ కథలో లీనమయ్యేలా చేశాడు. అడవిలో వింత జీవి ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఊపందుకుంటుంది. కార్తి మరణంతో… ఓ ట్విస్టు వస్తుంది. అక్కడ్నుంచి వింత జీవి చుట్టూనే కథ నడుస్తుంది. ఈ తరహా కథల్లో కావల్సిన ఎలిమెంట్.. ప్రేక్షకుడి ఊహకందని విషయాలు జరగడం. ఆ వింత జీవి ఎంత ప్రమాదకరమైనదో చూపించి, దాని బారీన పడితే హీరో, అతని టీమ్ ఏమైపోతుందో అనే భయం కలగడం. అయితే ఈ రెండూ `కెప్టెన్`లో లేవు. వింత జీవి మనుషులపై ఎటాక్ చేసి… స్పృహ తప్పిపోయేలా చేస్తుంది. అంతే. ఆ వింత జీవికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఏమంత ప్రభావంతంగా లేవు. ఓ అడవి, దాని చుట్టూ నడిచే సీన్లే కాబట్టి.. గ్రాఫిక్స్ ని పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సింది.
హాలీవుడ్ లో వింత ఆకారాలు, భయపెట్టే రూపాలు చూసినవాళ్లకు ఇదెమంత థ్రిల్లింగ్ గా అనిపించవు. పైగా.. వింత జీవి ఉందన్న విషయాన్ని రివీల్ చేయడం కూడా చాలా సాధారణంగా ఉంటుంది. మధ్యలో లవ్ ట్రాక్ ఒకటి జోడించారు. దాని వల్ల కథకు ఉపయోగం ఏమీ ఉండదు. కేవలం ఓ పాటకు, రెండు మూడు సీన్ల వరకూ సినిమాని లాగడానికి తప్ప. ఈ తరహా కథలన్నీ గ్రిప్పింగ్ గా సాగాలి. అనవసరమైన డేటా ఇవ్వకూడదు. కానీ.. `కెప్టెన్`లో ఆ లాగ్ ఎక్కువ కనిపిస్తుంది. సైంటిస్ట్ పాత్రలో సిమ్రాన్‌ని ఎంచుకొన్నారు. కొన్నిచోట్ల…. సైన్స్‌కి సంబంధించి సిమ్రాన్ కి కూడా తెలియని లాజిక్స్ హీరో చెప్పేస్తుంటే, ఆ సైంటిస్ట్ ఆశ్చర్యంగా చూస్తుంటే.. `ఈవిడ నిజంగా సైంటిస్టేనా` అని ప్రేక్షకులకు ఆశ్చర్యం వేస్తుంది. చివర్లో ఈ వింత జీవులందరికీ రాజు లాంటి… జీవితో హీరో తలపడి, నాశనం చేయడంతో కథ ముగుస్తుంది. అయితే ఆ క్లైమాక్స్ కూడా జనరంజకంగా ఏం లేదు. ఎప్పుడైతే గ్రాఫిక్స్ తేలిపోతాయో అప్పుడే ప్రేక్షకుడు ఇలాంటి కథల నుంచి డిస్కనెక్ట్ అయిపోతాడు. `కెప్టెన్`లోని ప్రధాన అవరోధమదే.
ఆర్య తన వరకూ న్యాయం చేశాడు. ఐశ్వర్య లక్ష్మి ఓ పాటలో, రెండు సీన్లలో కనిపించిందతే. అంతకు మించి ఆ పాత్ర గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. కెప్టెన్ టీమ్‌లోని మిగిలిన సభ్యులు ఓకే. సిమ్రాన్ పాత్రని మరింత బాగా తీర్చిదిద్దాల్సింది. టెక్నికల్ గా చూస్తే… కెమెరా వర్క్ బాగుంది. ఇమాన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే గ్రాఫిక్స్ విషయంలో సరైన బడ్జెట్ దొరకలేదో.. అంతకు మించి చేయలేకపోయారో తెలీదు గానీ… కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోయాయి. ఓ వింత జీవి చుట్టూ కథ నడపాలి అనుకోవడం కొత్త పాయింటే. కాకపోతే దానికి పకడ్బందీ స్క్రీన్ ప్లే కావాలి. టెక్నికల్ సపోర్ట్ కావాలి. అవి లేకపోవడంతో `కెప్టెన్` తేలిపోయాడు.
ఫినిషింగ్ టచ్: ప్రేక్షకులపై దాడి
తెలుగు360 రేటింగ్ : 2/5