Brahmastra Movie Review Telugu
తెలుగు360 రేటింగ్ : 2.75/5
బాలీవుడ్ ప్రస్తుతం ఫామ్ లో లేదు. పాన్ ఇండియా ఊసే లేనప్పుడు అన్ని ప్రాంతీయ భాషల ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ ఇప్పుడు సరైన ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తోంది. సౌత్ నుండి వెళ్ళిన ఆర్ఆర్ఆర్ పుష్ప కేజీఎఫ్ లాంటి చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంటే.. బాలీవుడ్ చిత్రాలు మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో బాలీవుడ్ ఆశలని మోస్తూ వచ్చిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం’. రణ్బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన చిత్రమిది. షారుఖ్ ఖాన్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలు వస్తోన్న ఈ చిత్రం మొదటి భాగం శివ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని రాజమౌళి తెలుగులో సమర్పించడంతో మరింత ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలు, బాలీవుడ్ ఆశలు మోసుకొచ్చిన బ్రహ్మాస్త్రం ఆ అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.
శివ (రణ్బీర్ కపూర్) ఒక అనాధ. డీజే అతని వృత్తి. దసరా ఉత్సవాల్లో ఇషా (అలియా భట్)ని చూసి ప్రేమలో పడతాడు. శివకి కొన్ని సూపర్ నేచర్ పవర్స్ వుంటాయి. కొన్ని సంఘటనలు అతని ఇమాజినేషన్ లోకి వస్తుంటాయి. అలాగే అగ్ని కూడా అతన్ని దహించలేదు. మోహన్ (షారుఖ్ ఖాన్) ఒక సైంటిస్ట్. జునూన్ (మౌనీ రాయ్) తన గ్యాంగ్ తో వచ్చి మోహన్ ని హతమర్చి అతని దగ్గర వున్న ఒక అస్త్రాన్ని పట్టుకుపోతుంది. ఇది శివ ఊహల్లోకి వస్తుంది. అదే ఊహ నిజమౌతుంది. ఆ తర్వాత రోజే మోహన్ చనిపోయాడని వార్త వస్తుంది. అనిష్ (నాగార్జున) వారణాసిలో ఉంటాడు. అతని దగ్గర మరో అస్త్రం వుంటుంది. ఆ అస్త్రాన్ని దక్కించుకోవడానికి జునూన్ గ్యాంగ్ వారణాసి కి వెళుతుంది. తన ఊహలో ఈ సంఘటన తెలుసుకున్న శివ ఎలాగైనా అనిష్ ని రక్షించడానికి వారణాసి వెళ్తాడు. అనిష్ ని జునూన్ గ్యాంగ్ నుండి శివ కాపాడాడా ? అసలు శివ ఎవరు ? అనాధ అయిన శివకి ఇలాంటి పవర్స్ ఎందుకు వచ్చాయి ? జునూన్ గ్యాంగ్ లక్ష్యం ఏమిటి ? హిమాలయల్లో వున్న గురువు (అమితాబ్ బచ్చన్)కి ఈ కథతో సంబంధం ఏమిటి ? ‘బ్రహ్మాస్త్రం’ గురించి గురువు చెప్పిన దేవరహస్యాలు ఏమిటి ? జునూన్ వెనుక వున్న దేవ్ ఎవరు ? అనేది మిగతా కథ.
ఫాంటసీ అడ్వంచర్ కథలు హాలీవుడ్ లో విరివిగా వస్తుంటాయి. ఈ జోనర్ కి ప్రేక్షకుల ఆదరణ కూడా ఎక్కువే. దర్శకుడు అయాన్ ముఖర్జీ బాలీవుడ్ కంటూ ఒక ఫాంటసీ అడ్వంచర్ సిరిస్ వుండలాని భావించి మొదలుపెట్టినప్పుడే మూడు భాగాల సినిమా ప్రకటించాడు. బ్రహ్మాస్త్రం’లో మూడు భాగాలకు సరిపడే మెటీరియల్ వుంది. వెలుగు చీకటి మధ్య జరిగే పోరాటం ఇది. ఇలాంటి ఫాంటసీ అడ్వంచర్ కథల్లో వుండే కామన్ పాయింటే. ఈవిల్ పవర్ అంధకారం కోరుకుంటుంది. హీరో లక్ష్యం వెలుగు వైపు వెళ్ళడం. ఈ పాయింట్ ని తనదైన స్టయిల్ లో ప్రజంట్ చేశాడు దర్శకుడు. ‘బ్రహ్మాస్త్రం’ గురించి చిరంజీవి వాయిస్ ఓవర్ తో కథ ఆసక్తికరంగా మొదలౌతుంది. మోహన్ వానర అస్త్రం సీక్వెన్స్ సినిమా పై అంచనాలు పెంచేస్తుంది. ఆ ఎపిసోడ్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దర్శకుడు.
వానర అస్త్రం ఎపిసోడ్ తో సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుందని భావించే లోపలే శివ, ఇషా ల మధ్య నడిపిన లవ్ ట్రాక్ మళ్ళీ రొటీన్ ట్రాక్ లోకి తేచ్చేస్తుంది. శివ ఇషా కెమిస్ట్రీ చూడటానికి బావున్నా.. ఈ కథకి అడ్డు తగులుతుందనే భావన కలుగుతుంది. అయితే కథ వారణాసికి షిఫ్ట్ అయిన తర్వాత నాగార్జున నంది అస్త్రం మళ్ళీ థ్రిల్ ని పంచుతుంది. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ బాంగ్ కూడా సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో ‘బ్రహ్మాస్త్రం’ గురించి అమితాబ్ పాత్రలో వివరించే ప్రయత్నం జరిగింది. ఆశ్రమంలో వుండే పాత్రలు, వారి శక్తులు ఫాంటసీ అడ్వంచర్ తగ్గట్టుగా చిత్రంగా అనిపిస్తాయి. అయితే ‘బ్రహ్మాస్త్రం’ గురించిన విశేషాలు దాని వెనుక వున్న కథని వాయిస్ ఓవర్ తోనే ఎక్కువగా సరిపెట్టేశాడు దర్శకుడు. ఇందులోనే దేవ్ పాత్ర వుంది. అది పార్ట్ 2 లో కీలక. అందుకే దాని గురించి ఎక్కువ వివరాల్లోకి వెళ్ళకుండానే ముగించేశాడు.
ఆశ్రమంలో శివ తన తల్లితండ్రుల గురించి తెలుసుకునే నిజాలు కూడా ఆసక్తికరంగానే వుంటాయి. కథలో అవి కీలకం కూడా. అయితే అవి కూడా వాయిస్ ఓవర్ లోనే వుంటాయి. దాదాపు అరగంట పైనే యాక్షన్ కైమాక్స్ రాసుకున్నాడు. ఇంత నిడివి యాక్షన్ వున్నపుడు అందులో కథని కూడా భాగం చేయాలి. ఈవిల్ అండ్ హీరో వార్ అన్నట్టుగానీ చాలా సుదీర్గంగా సాగుతుంది క్లైమాక్స్. ఒక దశలో కాస్త విసుగు కూడా తెప్పిస్తుంది. ప్రళయాన్ని ఆపే ఆసక్తి ప్రేమకి వుందని చెప్పే ప్రయత్నం అంతగా నప్పలేదు. ఆ కోణం లేకపోయినా కథపై పెద్ద ప్రభావం వుండదు.
రణ్బీర్ కపూర్ కి ఇది కొత్త పాత్ర. లవర్ బాయ్ ఇమేజ్ వున్న రణ్బీర్ ఇందులో వైవిధ్యంగా కనిపిస్తాడు. మరీ సూపర్ హీరోలా కాకుండా చివరి వరకూ కామన్ మ్యాన్ గానే చేశాడు. అలియా భట్ అందంగా వుంది. వారిద్దరి కెమిస్ట్రీ బావుంది. షారుక్ ఖాన్, నాగార్జున లు వారి అనుభవాన్ని చూపించారు. వీరిద్దరితో పోల్చుకుంటే అమితాబ్ పాత్ర నిడివి ఎక్కువే. అమితాబ్ పాత్ర, ఆశ్రమ నేపధ్యంతో స్పెషల్ యునివర్స్ క్రియేట్ అయ్యింది. మౌనీ రాయ్ కి ఫుల్ లెంగ్త్ విలనిజం పంచే అవకాశం దొరికింది. ఈవిల్ గా మెప్పిస్తుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. చాలా వరకూ విజువల్ ఎఫెక్ట్స్ త్రీడీని ద్రుష్టిలో పెట్టుకొని చేసినట్లు అనిపిస్తుంది. 2డీలో కంటే త్రీడీలో ఎఫెక్ట్స్ ని ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారు. నేపధ్య సంగీతం లౌడ్ గా వుంది. కుంకుమ, దసరా పాటలు చూడటానికి చాలా గ్రాండ్ గా వున్నాయి. కెమెరా పనితనం రిచ్ గా వుంది. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు.
బాలీవుడ్ కి గత కొన్నాళ్ళుగా హిట్స్ లేవు. ఆ లోటుని కొంత వరకు తీర్చగలిగిన యావరేజ్ సినిమా ఇది. మూడు పార్టులుగా వస్తున్న ఈ సినిమాకి.. శివ మంచి ఆరంభమే ఇచ్చాడు
తెలుగు360 రేటింగ్ : 2.75/5