ఏపీలో జనసేన పార్టీకి ఒక జడ్పీటీసీ ఉన్నారు. ఆయన పేరు గుండా జయప్రకాష్ నాయుడు . ప.గో జిల్లా వీరవాసరం మండలం నుంచి ఎన్నికయ్యారు. ఈయన కోసం ఇప్పుడు తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. ఎప్పుడు దొరికితే అప్పుడు పట్టుకుని వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. దీనికి కారణం ఆయన తెలంగాణ ప్రభుత్వాన్నే అడ్డంగా మోసగించడం. తెలంగాణలో రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లను అక్రమంగా దక్కించుకున్న గుండా జయప్రకాష్ నాయుడు అందు కోసం అడ్డదారులు తొక్కాడు. విషయాలన్నీ బయటకు రావడంతో ఆయనపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు వెదుకుతున్నారు.
తెలంగాణలోని 32జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలను వదిలేందుకు ఆ రాష్ట్ర మత్స్యశాఖ సుమారు రూ.113 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. భీమవరానికి చెందిన జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు పలువురి పేర్లతో తెలంగాణాలో 9 నుంచి 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాడు. అయితే, బ్యాంకు గ్యారెంటీ, పర్ఫామెన్స్ గ్యారెంటీల విషయంలో మోసానికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది.
బ్యాంకు గ్యారెంటీ నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారం కొంత కాలంగా తెలంగాణ ఫిషరీ డిపార్టుమెంట్లో కలకలం రేపుతోంది. జనసేన పార్టీ నేతలపై ఇటీవలి కాలంలో వరుసగా అవినీతి ఆరోపణలు వసతున్నాయి. జనసైనికులు కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక జడ్పీటీసీ కూడా కేసుల్లో ఇరుక్కోవడం.. జనసైనికుల్ని ఇబ్బంది పెడుతోంది.