ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ అనే ఊళ్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటన రెండేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితులు ఎప్పుడో బెయిల్ పొందారు. కానీ ఈ ఇష్యూను రిపోర్ట్ చేయడానికి కేరళ నుంచి యూపీ వెళ్లిన కేరళ జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో కప్పన్‌కు లింకు ఉన్నట్లు యూపీ పోలీసులు ఆరోపించి లోపలేశారు. రెండేళ్లయింది. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేకపోయినా బెయిల్ మాత్రం లభించలేదు. ఇప్పుడు సిద్దిక్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
కప్పన్‌ను మూడు రోజుల్లోపు ట్రయల్ కోర్టులో హాజరుపరిచి, బెయిల్‌పై విడుదలచేయాలని శుక్రవారం సిజెఐ యు.యు. లలిత్ ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని అది నేరం కాదని స్పష్టం చేశారు. కప్పన్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల గురించి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అతని వద్ద పేలుడు పదార్థాలను ఎక్కడ గుర్తించారని, కారులోనా అని ప్రశ్నించింది. అయితే వాటి గురించి పోలీసులు ఏమీ చెప్పలేకపోయారు. ఏమీ లేకుండా అల్లర్లు ఎలా వ్యాప్తి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు బెయిల్ ఇచ్చింది. సిద్ధిక్ కేరళ నుంచి వచ్చి రిపోర్టింగ్ చేస్తున్నారన్న కారణంగానే అక్కడి రాజకీయ ప్రభుత్వం కక్ష కట్టి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేద చట్టం కింద అరెస్ట్ చేశారు.
ఈ రాజకీయ అరెస్ట్ నుంచి ఏ వ్యవస్థలూ ఆయనను రక్షంచలేకపోయాయి. ఏ తప్పూ చేయకపోయినా.. చివరికి ప్రాథమిక సాక్ష్యాలు లేకపోయినా రెండేళ్ల పాటు ఆయన జైలులో ఉండాల్సి వచ్చింది. ఇలాంటి వారు సిద్ధిఖ్ ఒక్కరే కాదు. ఎంతో మంది ఉన్నారు. వీరంతా వ్యవస్థల వైఫల్యం వల్లనే జైలు పాలవుతున్నారు. దీనికి బాధ్యత వ్యక్తులది కాదు వ్యవస్థలదే.