విజయవాడ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఓ ఉన్నతాధికారి భార్య పట్టుబడ్డారు. ఆమెను రెండు రోజులుగా కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం కిలోకు కాస్త తక్కువగా 970 గ్రాముల బంగారం నీరజారాణి వద్ద దొరికిందని వచ్చింది. కానీ కిలో కన్నా తక్కువ బంగారం పట్టుబడితే పన్ను కట్టించుకుని వదిలేస్తారు. రెండురోజుల పాటు ప్రశ్నించరు. అంతే కాదు ఇలా పట్టుకుంది హైదరాబాద్ నుంచి వచ్చిన డీఆర్ఐ అధికారులు. పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ అవుతుందని స్పష్టమైన సమాచారం వస్తేనే వారు వస్తారు. అందుకే అసలు ఇప్పుడు పట్టుబడిన బంగారం ఎంత ? ఎవరు తెప్పిస్తున్నారు ? అసలు ఈ స్కాం వెనుక ఉన్నది ఎవరు ? ఇవన్నీ ఇప్పుడు సస్పెన్స్ ధ్రిల్లర్గా మారిపోయి.
ఇటీవల కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి విజయన్ పై ఆరోపణలు వచ్చాయి. అక్కడి సీఎంవోలో అధికారితో సన్నిహితంగా ఉండే మహిళ బంగాన్ని పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ చేస్తూ కేరళ తీసుకువచ్చేది. అందు కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే తరహాలో ఇక్కడా జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ ఐఏఎస్ అధికారి భార్య నీరజారాణి చాలా సార్లు దుబాయ్ వెళ్లి వచ్చారు. ఆమె ఒక్కరే కాదు.. కొంత మంది గ్రూప్ ఉందని.. వారంతా దుబాయ్ వెళ్తారని.. నేరుగా విజయవాడకే వస్తారన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడలో తనిఖీలు జరగకుండా చూసుకుంటారని … కానీ ఈ సారి హైదరాబాద్ నుంచి డీఆర్ఐ అధికారులు రావడతో గుట్టు బయటపడిందని చెబుతున్నారు.
నీరజారాణి భర్త ఎప్పుడో రిటైరయ్యారు. కానీ ప్రభుత్వ పెద్దలకు తమకు ఉపయోగపడేవారి కోసం ప్రత్యేకంగా పొడిగింపు ఇస్తూఉంటారు. ఇలా రిటైరైన నీరజారాణి భర్తకు కూడా రెండేళ్ల నుంచి పోస్టింగ్ ఉంది. ఆయన సీఎంవోలో పని చేసే ఓ ముఖ్య అధికారికి అత్యంత సన్నిహితుడు. ఆయన చెప్పినట్లే చేస్తూంటారు. ఆయన వ్యవహారాలపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన టీంలో నీరజారాణి కూడా ఉన్నారని.. ఆమెతో పాటు ఇంకెంత మంది ఇలా దుబాయ్ ప్రయాణాలు చేస్తున్నారో లెక్కతేలితే మొత్తం గుట్టు రట్టవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.