సినిమా అనేది అల్టిమేట్ గా ఎమోషనల్ కనెక్షన్. సినిమా చూస్తున్నపుడు ఏదో ఒక ఎమోషన్ తో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వాలి. అప్పుడే థియేటర్ నుండి ఒక తృప్తితో బయటికి వస్తాడు. ఈ ఎమోషన్ ని పట్టుకోవడంలో రాజమౌళి దిట్ట. ఆయన సినిమాల్లో పాటలు, ఫైట్లు ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. అయితే వాటిని కథలో బ్లెండ్ చేసిన విధానం మాత్రం సహజంగా వుంటుంది. పాత్రలని ఎమోషనల్ గా తీర్చిదిద్దటంలో కూడా రాజమౌళి నుండి చాలా నేర్చుకోవాలి. బాహుబలి, భీమ్, అల్లూరి, శివగామి, దేవసేన, కట్టప్ప ఇలా చెప్పుకుంటూ పొతే ఆయన సినిమాల్లో ప్రధాన పాత్రదారులు ఎమోషనల్ హై ఇస్తారు. ఎన్ని గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ వున్నా.. చివరిగా వాటిని ఎమోషనల్ గా ముడిపెట్టడంలోనే రాజమౌళి నేర్పు అందరూ నేర్చుకోతగ్గది.
తాజాగా వచ్చిన ‘బ్రహ్మాస్త్రం’ ను చూసుకుంటే రాజమౌళికి మిగతా దర్శకులకు తేడా స్పష్టంగా అర్ధమౌతుంది. ‘బ్రహ్మాస్త్రం’లో పాటలు, ఫైట్లు, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, సూపర్ స్టార్లు ఇలా అన్నీ హంగులు వున్నాయి. థియేటర్ ఎక్సపీరియన్స్ ఇచ్చే సినిమానే. అయితే ఎమోషనే మిస్ అయ్యింది. శివ పాత్ర గానీ అటు మిగతా పాత్ర గానీ ఎలాంటి ఎమోషనల్ ఇంపాక్ట్ ప్రేక్షకులకు ఇవ్వలేకపోయాయి. నిజానికి ఈ సినిమా దర్శకుడు ఐయాన్ ముఖర్జీ బలం ఎమోషన్స్. వేక్ అప్ సిద్, హే జవానీ హే దివానీ చిత్రాలు ఎమోషనల్ కనెక్షన్ ఉండేవే. ఐతే ‘బ్రహ్మాస్త్రం’ దగ్గరికి వచ్చేసరికి ఇది ఒక సూపర్ హీరో సినిమా. దిని కోసం హాలీవుడ్ సినిమాలని ఫాలో అయిపోయాడు ఐయాన్. దీంతో తెరపై మంచి దృశ్యాలు కనిపిస్తున్నా వాటిలో మనదైన ఎమోషన్ మాత్రం మిస్ అయ్యింది. లార్జర్ దెన్ లైఫ్ సినిమాల్లో ఎమోషన్స్ ని బ్లండ్ చేయడం ఒక ఆర్ట్. ఈ విషయంలో రాజమౌళికి మిగతా దర్శకులకు స్పష్టమైన తేడా మరోసారి కనిపించింది.