ఇసుక తీరువాల వేలం, ఆ రూపేణా ఇసుక మాఫియా చెలరేగిపోవడం.. అడ్డగోలు దోపిడీలు, దందాలు వందల కోట్ల రూపాయల అక్రమార్జనలకు అవకాశం.. ఇవన్నీ.. కొందరికి మాత్రం చాలా ఇంపుగా ఉంటాయి. దోచుకున్నంత వాళ్లకి దోచుకున్నంత మహదేవా అంటూ ఎక్కడికక్కడ అక్రమార్జనలకు లాకులు ఎత్తేసే ప్రబుద్ధులు ప్రతి సర్కారులోనూ ఉంటారు. అలాంటి ఒక మంత్రి ఇప్పుడు ఇసును ప్రజలకు ఉచితంగా ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబునాయుడు మీద అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నట్లుగా సెక్రటేరియేట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇసుక మాఫియా అనేది దిన దిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతూ ఉంటే.. తనకు కూడా ఎక్కడికక్కడ కోట్లలో వాటాలు నికరంగా వచ్చి ఇనప్పెట్టెలో వాలిపోతూ ఉంటాయి అనేది… సదరు మంత్రిగారి సదాలోచన. కానీ.. ఇలా చంద్రబాబు కత్తెర వేసేయడం ఇప్పుడు వారికి కంటగింపుగా మారింది.
చంద్రబాబునాయుడు తొలిసారిగా.. ప్రతిపక్షానికి చెందిన ఫైర్‌బ్రాండ్ రోజా లాంటి వారు కూడా కీర్తించే, సమర్థించే పాలన పరమైన నిర్ణం తీసుకున్నారు. ఇసును ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది కావడం చంద్రబాబుకు ఖచ్చితంగా ఎడ్వాంటేజీనే! అయితే ఆయన సొంత కేబినెట్‌లోనే సొంత పార్టీలోనే ఇసుక మాఫియా ద్వారా అడ్డగోలు దందాలకు అలవాటు పడిపోయిన వారు మాత్రం ఈ నిర్ణయాన్ని సహించలేకపోతున్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడివారికి అక్కడ వాటాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఓ మంత్రి మాత్రం పరమ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటే.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లోనే వ్యతిరేకత వస్తుందని పార్టీలో ఒక ప్రచారం పుట్టిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన ఖర్మం ఏంటంటే.. ప్రతిపక్షం వారు కూడా శెభాష్ అని నిర్ద్వంద్వంగా అనే ఒక నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు తీసుకుంటే, ఆయన సొంత పార్టీలోని మంత్రి దాన్ని సహించలేకపోవడం. కాకపోతే.. అంతో ఇంతో గుడ్డిలో మెల్ల లాంటి అదృష్టం ఏంటంటే.. జరగబోయే కేబినెట్ విస్తరణలో సదరు మంత్రిని కేబినెట్‌నుంచి తొలగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉండడం!!