తెలుగుదేశం పార్టీ యువ నేత లోకేష్ దూకుడు రాజకీయం ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతోంది. క్లాస్ నుంచి మాస్కు మారిన రాజకీయం వారిని ఆశ్చర్యపరుస్తోంది. లోకేష్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన మొదట్లో నీట్ షేవ్‌తో కనీసం మీసాలు కూడా లేకుండా ఉండేవారు. ఆయన ఆహార్యం రాజకీయాలకు వర్కవుట్ కాదన్న అభిప్రాయం మొదట్లోనే వినిపించింది. అయితే పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో పకడ్బందీగా వినియోగించుకున్న రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై క్లాస్ ముద్ర వేశారు. అది లోకేష్‌కు మైనస్ అయింది.
లోకేష్ మొదట్లో తెలుగులో ప్రసంగించాల్సి వచ్చినప్పుడు తడబడేవారు. ఒక్కో సారి అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేసేవారు. వాటిని విస్తృతంగా వైరల్ చేసేవారు. అయితే లోకేష్ ఇప్పుడు రూపంతో పాటు మాటల్లోనూ పూర్తిగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి చూసి చదువుతూ కూడా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ లోకేష్ చూడకుండానే స్పష్టమైన తెలుగు మాట్లాడుతూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ నేతలు చేసే విమర్శలకు అదే భాషలో కౌంటర్ ఇస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు లోకేష్ కౌంటర్లను వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ప్రసంగాలు టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాయి. లోకేష్ రూపం కూడా పూర్తిగా మారిపోయింది.
గతంలో లోకేష్ చేసే విమర్సలను విపక్ష పార్టీల నేతలు ట్రోల్ చేసేవారు. కానీ ఇప్పుడు ఘాటుగా సమాధానాలిస్తున్నారు. లోకేష్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ మహిళా నేత ఏకంగా మద్యం, మగువ లేకపోతే లోకేష్ నిద్రపట్టదని తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. గతంలో ఆయనపై చేసిన విమర్సలకు ఇవి భిన్నమైనవి . ఇలా రాజకీయ ప్రత్యర్థుల విమర్శల్లోనూ మార్పులు తెచ్చేలా లోకేష్ రాజకీయంగా మారిపోయారు. మార్పు మంచిదేనని టీడీపీ కార్యకర్తలు సంతోషిస్తున్నారు.