సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు పలు చోట్ల జనసేన వైపు చూస్తున్నారు. టీడీపీలో అప్పటికే పాతుకుపోయిన నేతలు ఉండటంతో చాన్స్ వస్తుందో రాదోనన్న ఉద్దేశంతో పాటు పొత్తు ఉంటే.. తమ గెలుపు ఖాయమన్న నమ్మకానికి రావడంతో ఎక్కువ మంది జనసేన వైపు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో జనసేనలో జరుగుతున్న చేరికలు ఎక్కువగా వైసీపీ నుంచే ఉంటున్నాయి. గుడివాడలో జనసేన తరపున పోటీ చేయడానికి .. కొడాలి నాని సన్నిహితులుగా పేరు పడిన పాలంకి బ్రదర్స్ పార్టీ మారారు. వారు సొంత రాజకీయం చేస్తున్నారు.
తాజాగా రాజోలు నియోజకవర్గం నుంచి గత రెండు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు కూడా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన రహస్యంగా పవన్ కల్యాణ్‌ను కలిశారు. అయితే రాజోలులో ఇప్పటికే జనసేన తరపున టిక్కెట్ కోసం మాజీ ఐఏఎస్ ఒకరికి పవన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన నియోజవకర్గంలో పని చేసుకుంటున్నారు. బొంతు రాజశ్వేరరావును పూర్తిగా పిండేసిన తరవాత వైసీపీ నేతలు పట్టించుకోవడం మానేశారు. ఆయన జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామిరెడ్డి అనే వైసీపీ నేత కూడా జనసేనలో చేరారు.
వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదని రెడ్డి నేతనే పార్టీని వీడి జనసేనలో చేరడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంకా పలువురు నేతలు చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటే చాలా మంది వైసీపీ నేతలు.. ప్రజాప్రతినిధులు సహా జనసేనలో చేరే అవకాశం ఉందని.. నాయకుల కొరత ఉన్న జనసేన తమను చేర్చుకుని టిక్కెట్లు ఇస్తుందని వారు నమ్ముతున్నారు. అందుకే ముందు ముందు జనసేనలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉంది.