అమరావతి రైతులు మహా పాదయాత్ర ప్రారంభించారు. ఈ సారి పాదయాత్రకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రాజ్యాంగం సహా చట్టం, న్యాయం మొత్తం రైతులకు అనుకూలంగా ఉంది. అయినా వేటినీ లెక్క చేయబోమని చెబుతున్న ప్రభుత్వం మూడు రాజధానులు ఖాయమని రెచ్చ గొడుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా.. అమరావతకే తమ మద్దతు అని ప్రకటించి ఆ ప్రాంతంలో పాదయాత్ర కూడా చేసిన పార్టీగా బీజేపీ పాత్ర ఇప్పుడు కీలకం కాబోతోంది. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునే కుట్రలు కూడా జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో బీజేపీ తాము అమరావతికి అండగా ఉంటామని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పట్లాగే.. అమరావతికి మద్దతు.. రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం అని కబుర్లు చెబితే… రైతులు నమ్మరు ఇప్పటికీ జగన్‌తో కలిసి వారు తమను రోడ్డున పడేశారని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. సోము వీర్రాజు పాదయాత్రలో నేరుగా నిలదీశారు కూడా. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా పార్లమెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చంద్రబాబు ప్రకటించారు.
ఈ క్రమంలో అమరావతి రైతులపై.. పాదయాత్రపై ఎలాంటి కుట్రలు జరిగిన తిప్పికొట్టేలా అండగా ఉండాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. అరాచకానికి కేరాప్ అడ్రస్‌గా ఉన్న ఏపీప్రభుత్వం ఏంచేయడానికైనా వెనుకాడదని ఇప్పటికే అనేక రకాల ఉదాహరణలు వెలుగుచూశాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చట్టాలను.. రాజ్యాంగాలను ఉల్లంఘించాలని చూసినా సైలెంట్‌గా ఉంటే.. ఇక బీజేపీకి ప్రజలు ఎవరూ నమ్మలేరు. అందుకే ఓ రకంగా అమరావతి రైతుల పాదయాత్ర బీజేపీకి టెస్టింగ్ టైమ్ అనుకోవచ్చు.