వైసీపీలో విజయసాయిరెడ్డికి మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయనకు ఉన్న పదవుల్ని ఒక్కొక్కటిగా పీకేస్తున్నారు. తాజాగా పార్టీ పుట్టుక నుంచి చూస్తున్న సోషల్ మీడియా విభాగాన్ని ఆయన నుంచి తొలగించారు. ఓ సీనియర్ నేత కొడుక్కి ఇవ్వాలని జగన్ ఆదేశించారు. నిజానికి విజయసాయిరెడ్డిని కొంత కాలంగా దూరంగా ఉంచడంతో ఇటీవల సోషల్ మీడియా పేరుతో చేసిన కొత్త నియామకాల కార్యక్రమానికీ ఆయన హాజరు కాలేదు. ఆయనను ఆహ్వానించలేదు. సజ్జలే అన్నీ చూసుకున్నారు. అంటే సజ్జల టేకోవర్ చేశారన్నమాట.
గతంలో ఆయనను పార్టీ కార్యాలయానికి పరిమితం చేసి.. సోషల్ మీడియా, ఇతర అనుబంధ సంఘాల బాద్యతలిచ్చారు. తర్వాత ఏమైందో కానీ జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలను కూడా ఆయనకే అప్పగించారు. కానీ ఇప్పుడు అనధికారికంగా అయినా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకుంటున్నారు. విజయసాయిరెడ్డికి పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేవు. పార్టీ కార్యాలయంలో ఆయన కనిపించి చాలా రోజులైంది. ఇటీవలి కాలంలో ఆయన ట్వీట్లు కూడా అదే సూచిస్తున్నాయి. చాలా పరిమితంగా ఆయన వైసీపీ సోషల్ మీడియా పోస్టుల్ని షేర్ చేస్తున్నారు. ఎక్కువగా హిందీ ట్వీట్లు పెడుతున్నారు.
అత్యవసరం అయితే తప్ప జగన్ను పొగిడేందుకు ఒకటి అరా ట్వీట్లు పెడుతున్నారు. విజయసాయిరెడ్డికి ఇలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏమిటన్నదానిపై వైసీపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గతంలోనే ఆయనపై జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కానీ వైఎస్ భారతి దగ్గర లాబీయింగ్ చేసుకుని ప్రాధాన్యం పొందారని ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డితో పాటు భారతిపేరు కూడా వెలుగులోకి రావడానికి కారణమయ్యారన్న కారణంగా జగన్ అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అదే నిజమైతే విజయసాయిరెడ్డకి గడ్డు పరిస్థితే.