తెలంగాణ బీజేపీలో ఓ రకమైన ఉత్సాహం కనిపిస్తోంది. అగ్రనేతలు దూసుకెళ్తున్నారు. కానీ వారికి క్షేత్ర స్థాయిలో బలం ఉందా అన్న డౌట్ మాత్రం అలాగే ఉండిపోయింది. దీనికి కారణం నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు ఉన్నారా అని చూస్తే… ఎక్కడా కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయి.. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటే గెల్చుకున్న బీజేపీ ఇప్పుడు హాట్ ఫేవరేట్లలో ఒకటిగా మారింది. అయితే ప్రజలు ఓట్లేస్తామన్నా.. వేయించుకునే అభ్యర్థులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో దొరకలేదు.
తెలంగాణ బీజేపీలో అగ్రనేతలకు కొదవలేదు. వారిలో నియోజకవర్గాల్లో పట్టు ఉన్నవాళ్లు తక్కువే.. రాష్ట్ర నాయకులు.. ఓ పది..పదిహేను నియోజకవర్గాల్లో బలంగా ఉంటారు. మరి మిగతా నియోజకవర్గాల్లో ఎవరు పార్టీ బాధ్యత తీసుకుంటారు? . ఇదే ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో బీజేపీకి చాలా చోట్ల నాయకులు కలిసి వచ్చారు. క్యాడర్ కూడా పెరిగింది. కానీ నియోజకవర్గం మొత్తాన్ని నడిపించే నాయకుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. తాము పోటీ చేస్తామంటే.. తాము పోటీ చేస్తామని రేసులోకి నియోజకవర్గానికి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు కానీ వారెవరూ పార్టీ బలానికి తమ బలం యాడ్ చేసి సీటును గెలిపించుకువస్తామనే వాళ్లు కాదు.
పూర్తిగా పార్టీ మీద ఆదారపడేవారే. అక్కడే అసలు సమస్య వస్తోంది. గెలుపు గుర్రాల కోసం ఎదురు చూపులు చూడక తప్పని పరిస్థితి. కారణం ఏమైనా కావొచ్చు కానీ..పార్టీలో నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రం చేరడం లేదు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చర్చలు జరిపి.. సుముఖత వ్యక్తం చేసిన తర్వాత కూడా కొందరు వెనుకడుగు వేస్తున్నారు. వారికి సరైన భరోసా లభించకపోవడమే కారణం. మునుగోడు ఉపఎన్నికల తర్వాత ఈ సమస్య తీరిపోతుందని ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.