తెలంగాణ అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ను మరోసారి సస్పెండ్ చేశారు. నిన్న సభకు హాజరు కాకపోవడంతో అధికారపక్షం పట్టించుకోలేదు. ఈ రోజు కూడా ఆయన హాజరు కాకపోతే పట్టించుకునేవారు కాదేమో కానీ నిన్న గైర్హజరుతో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేందుకు ఈటల ప్రయత్నించారు. సభకు వెళ్తున్నట్లుగా మీడియాకూ సమాచారం ఇచ్చారు. అయితే సభ ప్రారంభమయ్యేలోపే స్పీకర్ కార్యాలయం నుంచి ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం వెలువడింది.
సభ ప్రారంభం రోజున నిర్వహించిన బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను పిలువలేదన్న కారణంగా స్పీకర్‌పై మరమనిషి అనే వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్ . ఇలా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని క్షమాపణ చెప్పకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈటల రాజేందర్ తాను అనుచితమైన వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. స్పీకర్ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరడంతో ఈటలను అసెంబ్లీ నుంచి స్పీకర్ పోచారం సస్పెండ్ చేశారు.
అసెంబ్లీకి వచ్చిన ఈటలను పోలీసులు బలవంతంగా సభ నుంచితీసుకెళ్లిపోయారు. గెలిచినప్పటి నుండి అసెంబ్లీకిహాజరు కాకుండా కుట్ర చేస్తున్నారని.. గొంతు నొక్కుతున్నారని ఈటల మండిపడ్డారు. బీజేపీ సభ్యులకు బడ్జెట్ సమావేశాల నుంచి కష్టాలు కొనసాగుతున్నాయి. అప్పట్లో బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారన్న కారణంగా ముగ్గురిని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు. ముగ్గురిలో ఈటల సస్పెండ్ కాగా.. రాజాసింగ్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు రఘునందన్ రావు ఒక్కరే సభలో ఉన్నారు. ఈటల సభలో ఉండటం కేసీఆర్‌కు ఇష్టంలేదని ఆయన మొహం చూడటం ఇష్టం లేకనే ఆయనను సస్పెండ్ చేస్తున్నారని బీజేపీ నేతలు మండి పడుతున్నారు.