మూడు రాజధానుల బిల్లు పెడతాం అని హడావుడి చేస్తున్న ఏపీ ప్రభుత్వం చివరికి రాజ్యాంగానికి భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. అదే సమయంలో ఆ తీర్పును ఇంత వరకూ సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదు. స్టే కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. అప్పటికీ తీర్పుపై అసెంబ్లీలో కూడా చర్చించారు. న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు బిల్లు పెట్టడానికి మాత్రం ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. చివరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
అసెంబ్లీ సమావేశాల తొలి రోజే అంటే గురువారమే మూడు రాజధానుల అంశంపై లఘు చర్చనిర్వహించనున్నారు. ఇందులో ఎలాగూ టీడీపీ నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. వైసీపీ తరపున మాట్లాడటానికి కూడా ఎవరికైనా చాన్సిచ్చినా.. స్క్రిప్ట్ చదవడం తప్ప చేసేదేం లేదు. అయితే ఈ స్క్రిప్ట్ ను కూడా సీఎం జగన్ ఎక్కువ సేపు చదవనున్నారు. మూడు రాజధానులు చేస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
జగన్ ఇచ్చే మూడు రాజధానుల ప్రజెంటేషన్ పై ఇప్పటికే చాలా మంది కసరత్తు చేస్తున్నారు. గతంలో మూడు రాజధానులపై చాలా సార్లు చెప్పారు. కానీ చేసిందేమీ లేదు. ఎన్నికలకు ఇదే ఎజెండాగా పెట్టుకుని వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి.. దీన్నే హైలెట్ చేయాలనకుుంటున్నట్లుగా తెలుస్తోంది.