దేశంలో అత్యంత విలువైన పరిశ్రమ గుజరాత్‌కు తరలిపోయింది. చివరి వరకూ అది మహారాష్ట్రలో ఉంటుందని అనుకున్నారు. కానీ కేంద్రంలోని పెద్దలు పరోక్షంగా చక్రం తిప్పడంతో గుజరాత్‌కు తరలిపోయింది. వేదాంత-ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలనినిర్ణయించుకుంది. మహారాష్ట్రతో దాదాపుగా చర్చలు పూర్తయిన దశలో అక్కడ ప్రభుత్వం మారింది. తర్వాత ఏమయిందో కానీ హఠాత్తుగా వెళ్లి గుజరాత్ ప్రభుత్వంతో ఆ రాష్ట్రంలో కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం వేదాంత, ఫాక్స్‌కాన్ ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ వ్యవహారం మహారాష్ట్రలో సంచలనం రేపుతోంది. బీజేపీ గుజరాత్ కోసం మహారాష్ట్రను ఖాళీ చేస్తోందని విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ మహారాష్ట్ర ఒక్కటే కాదు… అనేక రాష్ట్రాలు కూడా అదే ఆలోచనతో ఉన్నాయి. గుజరాత్ దేశంలో ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ది చెందిన రాష్ట్రం. పెట్టుబడుల్లో సగం ఆ రాష్ట్రానికే వెళ్తున్నాయి.కానీ కేంద్రం అన్ని వైపులా దేశాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడుల వికేంద్రీకరణ చేయడం లేదు. బలాన్ని ఉపయోగించి గుజరాత్‌కే తరలిస్తోంది. గతంలో కియా పరిశ్రమను కూడా గుజరాత్‌కు తరలించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల తెలంగాణకు కేటాయించిన కొన్ని ప్రాజెక్టులు కూడా గుజరాత్‌కు వెళ్లిపోయాయి. ఖాజీపేట్‌లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ రూ.21,969 కోట్ల ఈ ఎలక్ట్రిక్ కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు ప్రకటించారు. గుజరాత్లో అమరావతిలను మించిన రెండు సిటీలను కడుతున్నారు. ధోలెలా , గిఫ్ట్ సిటీల పేరుతో నిర్మాణం అవుతున్న వీటికి పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు రావాల్సిన వాటినే మళ్లిస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వాలు లేదా బీజేపీ సామంత ప్రభుత్వాలు. ఒకరిద్దరు ముఖ్యమంత్రులు నోరు మెదుపుతున్నా వారిది రాజకీయ అజెండా. అందుకే దేశంలో గుజరాత్ తప్ప మరే రాష్ట్రంలోనూ పారిశ్రామిక అభివృద్ధి..పెట్టుబడులు కనిపించని పరిస్థితి.