ఢిల్లీలో కేంద్రం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో పలు పార్టీలతో పాటు గద్దర్ వంటి ప్రముఖులు కూడా అన్ని పార్టీల నేతలను కలిసి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. ఇదే డిమాండ్‌తో తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఆ వెంటనే కేసీఆర్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇలా అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అంతే కాదు ఢిల్లీలోని సెంట్రల్ విస్టాకు కూడా తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని అంబేద్కర్ పేరును పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించారు. కొత్త సచివాలయానికి ఎవరి పేరు పెట్టాలన్న చర్చ ఇప్పటి వరకూ పెద్దగా జరగలేదు. అయితే అనూహ్యంగా పార్లమెంట్ కార్యాలయానికి పేరుపెట్టాలని వస్తున్న డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోకపోవడంతో కేసీఆర్ అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీపై మరింత ఒత్తిడి పెరగనుంది. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ గౌరవించాలంటే సెంట్రల్ విస్టాకు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందేనని.. లేకపోతే అవమానించినట్లేనన్న వాదన టీఆర్ఎస్ వర్గాలు చేయడానికి అవకాశం ఉంది.
గతంలో బీజేపీ ఇలాంటి రాజకీయాలను ఊహించని వేగంతో చేసేది. ఇప్పుడు కేసీఆర్ ఆ వేగాన్ని అందుకుంటున్నారు. ఎలాంటి డిమాండ్లు లేకపోయినా .. వస్తాయని ఊహించిన వెంటనే.. వాటిని అమలు చేసేస్తున్నారు. విపక్షాలకు చాన్సివ్వడం లేదు..పైగా ఎదురుదాడి చేయగలుగుతున్నారు.