తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు ప్రకటించేశారు చంద్రబాబు. టీడీఎల్పీ సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో గన్నవరం, చీరాల, విశాఖ దక్షిణం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. మిగిలిన పందొమ్మిది మందికి టిక్కెట్లు ఖరారు చేశారు. అయితే వీరిలో గంటా శ్రీనివాసరావు అటూ ఇటూ కాకుండా ఉన్నారు . పార్టీతో అంటీ ముట్టకుండా ఉన్నారు. పార్టీపిలుపునిచ్చిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు.
అయినప్పటికీ ఆయనకూ చంద్రబాబు ఖరారు చేశారు. అయితే అందరికీ ప్రకటించి గంటాకు ఒక్కడికి తప్ప అంటే బాగోదన్న ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి ప్రకటన చేశారని.. తర్వాత పరిస్థితిని బట్టి గంాటను మార్చే చాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు ఇప్పటికే దాదాపుగా వంద నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేశారు. వారితో ముఖా ముఖి మాట్లాడి టిక్కెట్ ఖరారు చేసినట్లుగా చెప్పి పంపిస్తున్నారు.
గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలు.. పెద్దగా పని చేయని ఇంచార్జులు ఉన్న చోట్ల మాత్రం కసరత్తు చేస్తున్నారు. జగన్ వ్యూహాలన్నీ ముందస్తుకు వెళ్లడం ఖాయమన్నట్లుగా ఉండటంతో చంద్రబాబు ఏ మాత్రం చాన్స్ తీసుకోవడం లేదు. పూర్తి స్థాయిలో శక్తి యుక్తులు కేంద్రీకరిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో నామినేషన్ల వరకూ నాన్చడం చంద్రబాబు స్టైల్.. కానీ ప్రతిపక్షంలో ఉండటంతో పూర్తిగా పార్టీపైనే దృష్టి పెట్టి ఢీ అంటే ఢీ అనే నాయకుల్ని రెడీ చేసుకోవడంతో అభ్యర్థుల ఎంపిక సులవు అవుతోంది.