అమరావతి రాజధాని విషయంలో బీజేపీ చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెబుతోంది. జగన్ అసెంబ్లీలో మూడు రాజధానులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని.. బిల్లు పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పుడే బీజేపీ కీలక నేతల నుంచి ప్రకటనలు వచ్చాయి. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి నారాయణస్వామితో పాటు జీవీఎల్ నరసింహారావు కూడా ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం .. జగన్ రాజధానితో రాజకీయాలు చేస్తుందని తేల్చేశారు.
అసెంబ్లీ ఎక్కడఉంటే అక్కడే రాజధాని అని నారాయణ స్వామి స్పష్టం గా చెప్పారు. ఇప్పుడు రాజధాని మార్చడం సాధ్యం కాదన్నారు. నారాయణ స్వామి అధికారికంగా ఫీడ్ బ్యాక్ తీసుకోకుండా ఎలాంటి ప్రకటనలు చేసే అవకాశం ఉండదు. బీజేపీ పెద్దలు రాజధాని అంశంపై స్పష్టమైన క్లారిటీ ఇస్తేనే అలా మాట్లాడి ఉంటారు. అదే సమయంలో జీవీఎల్ నరసింహారావు కూడా స్పష్టంగానే చెప్పారు. గతంలో జీవీఎల్ మూడు రాజధానులకు నైతిక మద్దతు ఇచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అనేవారు. ఇప్పుడు పాడిందే పాటగా మూడు రాజధానులు అంటున్నారని..అమరావతినే ఉంటుందని చెబుతున్నారు.
అయితే రాజకీయంగా బీజేపీ అమరావతిని సపోర్ట్ చేస్తోంది. కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా మరింత క్లారిటీగా వ్యవహరించాల్సి ఉంది. కేంద్ర సంస్థలను అమరావతిలో వేగంగా నెలకొల్పడంతో పాటు హైకోర్టు తీర్పును ధిక్కరిస్తున్న ప్రభుత్వంపైనా ఒత్తిడి తేవాల్సి ఉంది. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించేలా చేస్తే కొంత వరకైనా డ్యామేజ్ కవరయ్యే చాన్స్ ఉంటుంది. మరి ప్రభుత్వం అలా చేయగలుగుతుందా ?