ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు ఏ మాత్రం ఆగడం లేదు. ఈడీ మరోసారి దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. ఈ సారి హైదరాబాద్‌తో పాటు ఏపీలోని నెల్లూరు జిల్లాలోనూా సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరు, చెన్నైలలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఈ సారి పూర్తిగా ఈడీ తెలుగురాష్ట్రాల్లో లిక్కర్ స్కాం మూలాలపై దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కింగ్పిన్లు తెలుగు వాళ్లేనని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడికి చెందిన అరబిందో గ్రూప్ పైనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి.
అలాగే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన కంపెనీలపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఈ రెండు కంపెనీలతో సంబంధం ఉండి.. డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు ఉన్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు లిక్కర్ స్కాంలో జగన్ సతీమణి హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ఏపీలో జరుగుతున్న సోదాలకు జగన్ సతీమణికి సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం మాగుంట కు సంబంధించిన అంశాల్లోనే సోదాలు జరుపుతున్నారు.
అరబిందో గ్రూప్ వ్యవహారాలన్నీ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంను బీజేపీ సీరియస్‌గా తీసుకుంటోందని.. లెక్కలు తేల్చడం ఖాయమన్న వాదన వినపిస్తోంది. ఏ ఆధారాలులేకుండా ఢిల్లీ బీజేపీ నేతలు ఏపీకి వచ్చి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ ప్రబుత్వ పెద్దలున్నారని ఆరోపించరని గుర్తు చేస్తున్నారు. ముందు ముందు ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.