ఢిల్లీ లిక్కర్ స్కాం మాస్టర్ మైండ్ కవితేనంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఆషామాషీ కాదని తేలింది. కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కరోనా సోకడంతో క్వారంటైన్లో ఉన్నారు. ఈ కారణంగా ఈడీ అధికారులు నోటీసులను కుటుంబ సభ్యులకు ఇచ్చారు. కరోనా తగ్గిన తర్వాత ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. గతంలో ఓ సారి దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ… ఇప్పుడు కేవలం హైదరాబాద్ లో జరిగిన వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ సిటీలో రెండుసార్లు సోదాలు జరిపింది. గత తనిఖీల సమయంలో రామచంద్రపిళ్లై ఇల్లు, ఆఫీస్ లలో సోదాలు జరిగాయి. ఇప్పుడు కవిత పర్సనల్ ఆడిటర్ అయిన గోరంట్ల అండ్ అసోసియేట్స్ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లోనూ సోదాలు జరగాయి. ఆ సమయంలోనే కవితకు నోటీసులు జారీ అయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కల్వకుంట్ల కవితపై పలు ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆమె ప్రమేయం కీలకమని.. ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కల్వకుంట్ల సన్నిహితులుగా పేరు పడిన అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి వంటి వారి ఇళ్లలో రెండు సార్లు సోదాలు నిర్వహించింది. తాజాగా కవితకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతోంది.