తెలంగాణ కాంగ్రెస్‌లో పదవులు తీసుకోవడానికి రెడీగా ఉంటారు కానీ బాధ్యతలకు మాత్రం సిద్ధంగా ఉండరని మరోసారి స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికే మునుగోడు ఉపఎన్నికను తీసుకొచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉంటారు. కానీ గెలవడానికి మాత్రం ఎవరూ ప్రయత్నించడం లేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే.. అర్జంట్‌గా ఓ కమిటీని ప్రకటించారు. ప్రచారం సహా మొత్తం ఆ కమిటీనే చూసుకుంటుందని ప్రకటించారు. ఆ కమిటీకి చైర్మన్‌గా మధుయాష్కీ గౌడ్‌ను ప్రకటించారు. ఇన్ని రోజుల తర్వాత హఠాత్తుగా మధు యాష్కీ బాధ్యతల నుంచి వైదొలిగారు.
తాను రాష్ట్ర స్థాయి నేతనని తనకు ఇలా నియోజకవర్గానికి పరిమితం చేయడం ఏమిటని ఆయన హైకమాండ్ వద్ద అసంతృప్తి వ్యక్తం చేయడం.. తాను పని చేయలేనని చెప్పడంతో .. రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ఆ బాధ్యతలిచ్చారు. మిగతా కమిటీ సభ్యులు యథావిధిగా ఉంటారు. గత నెల రోజులుగా కమిటీ చైర్మన్ గా ఉన్న మధు యాష్కీ.. కాంగ్రెస్ క్యాడర్‌ను కాపాడేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. అందరూ వెళ్లిపోతున్నా పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి పర్యటనలతో వస్తున్న భరోసాని నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నించలేదు. కానీ చివరికి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
మునుగోడులో ఓడిపోతే .. కమిటీ చైర్మన్‌గా ఆయనకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఈ విషయం తెలుసుకునే మధుయాష్కీ వైదొలిగారని అంటున్నారు. పదవుల కోసం రాహుల్ గాంధీ వద్ద ఉన్న పరిచయాలను వాడుకునే మధుయాష్కీ కాంగ్రెస్ కోసం మాత్రం ఎప్పుడూ పని చేసిన దాఖలాల్లేవని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైతేనే.. మునుగోడులో కాంగ్రెస్ పార్టీలో సగం మందికిపైగా బీజేపీకి తరలించిన తర్వాత మధుయాష్కీ సైలెంటయ్యారు. ఇప్పుడు ఏం జరిగినా రేవంత్ మీద నెట్టేయడానికి అవకాశం చిక్కుతుంది.