ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లకు ఎలాంటి పనులు అప్పచెప్పకూడదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరోసారి ఆదేశాలు జారీ చేశారు . ఇలాంటి ఆదేశాలే ఆధార్‌తో ఓటర్ అనుసంధానానికి ముందు జారీ చేశారు. ఆధార్‌తో ఓటర్ అనుసంధానం చేసే పనుల్లో వాలంటీర్లు పాల్గొంటే చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఏపీలో జరుగుతోంది అదే. వాలంటీర్లే ఓటుకు ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. ఈ విషయంలో పదుల కొద్దీ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి సీఈవో దృష్టికి వచ్చాయేమో కానీ. మరోసారి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవరు అమలు చేస్తారు ?
ఏపీలో అధికార పార్టీ ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను పెట్టుకుంది. ఆ యాభై ఇళ్ల సమాచారాన్ని వారి ఫోన్లలో నిక్షిప్తం చేసింది. వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి.. వారి సమాచారాన్నంతా వాలంటీర్లు గుప్పిట పట్టుకున్నారు. దీన్ని చూపించే ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరిస్తున్నారని పదే పదే ప్రచారం జరిగింది. పథకాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్న ఆడియో.. వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎన్నికల ప్రక్రియలో వారిని భాగస్వామ్యం చేయకుండా ఉండలేకపోయారు.
వలంటీర్లు అందరూ తమ పార్టీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వారు వైసీపీకి బహిరంగంగానే పని చేస్తున్నారు. ఇందులో దాపరికమేమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ఖాయం. వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న ఆదేశాలు జారీ చేస్తే సరిపోవు. వాటిని అమలు చేయడానికి అవసరమైన పటిష్టమైన చర్యలను ఈసీ తీసుకోవాలి. లేకపోతే.. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది.