టాలెంట్ కంటే… హిట్ ట్రాక్ ని నమ్మే పరిశ్రమ ఇది. చేతిలో మంచి కథ ఉండడం కంటే..ఓ హిట్టు ఉండడం ముఖ్యం. హిట్టున్న దర్శకుడితో పనిచేయడంలోనే ఎక్కువ సౌకర్యం ఉందని హీరోలు నమ్ముతున్నారు. అది సేఫ్ జర్నీ కూడా. అయితే ఈ శుక్రవారం విడుదలైన ఓ సినిమా.. ఇద్దరు హీరోల గుండెల్లో గుబులు రేపింది. ఆ సినిమానే.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.
ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమా చేయాలని నాగచైతన్య ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ సెట్ కాలేదు. ఇన్నాళ్లకు ఈ కాంబోలో సినిమా ఒకటి ఓకే అయ్యింది. ‘ఈ అమ్మాయి..’ తరవాత ఇంద్రగంటి చేసే సినిమా చైతూతోనే. ఇప్పుడు ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఫ్లాప్ అయ్యింది. దాంతో… చైతూలో టెన్షన్ మొదలైంది. ఇంద్రగంటి ఇది వరకు తీసిన ‘వి’ కూడా డిజాస్టరే! బ్యాక్ టూ బ్యాక్ రెండు డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుడితో సినిమా అంటే ఏ హీరో అయినా.. ఇబ్బంది పడతాడు. కాకపోతే.. చైతూ ఈ కథకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి… ఇప్పుడేం చేయలేని పరిస్థితి.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా ఇంద్రగంటితో సినిమా చేయాలని ఉత్సాహం చూపించాడు. దిల్ రాజు బ్యానర్లో విజయ్ ఓ సినిమా చేయాలి. అందుకోసం దిల్ రాజు చాలా కథలు విన్నారు. చివరికి ఇంద్రగంటి చెప్పిన లైన్ బాగా నచ్చడంతో విజయ్ కి సూటవుతుందని దాన్ని హోల్డ్ చేసి పెట్టారు. ఇప్పుడు `ఆ అమ్మాయి..` ఫ్లాప్ అయ్యింది. రౌడీ ఎలాగూ మాట ఇవ్వలేదు కాబట్టి… ఈ కాంబో నుంచి తప్పుకొనే ఛాన్సుంది. ఇంద్రగంటి ప్రతిభావంతుడైన దర్శకుడే. సూపర్ డూపర్ హిట్లు ఇవ్వలేదు కానీ, తనకంటూ ఓ సెపరేట్ ఆడియన్స్ ని సృష్టించుకొన్నాడు. అయితే.. ‘ఆ అమ్మాయి..’లో ఇంద్రగంటి మార్క్ కనిపించలేదు. సినిమా ఫ్లాప్ అయినా… ‘ఏదో కొత్తగా ట్రై చేశాడు లే’ అనుకోవడానికి కూడా ఏం లేకుండా పోయింది. ఈ సినిమా.. ఇంద్రగంటి కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నది విశ్లేషకుల మాట.