అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మార్చి మొదటి వారంలో హైకోర్టు అమరావతి విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి పనులన్ని పూర్తి చేయాలని తీర్పును వెలువరించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో రాజధానిపై చట్టలు చేసే అధికారం లేదని తీర్పు ఇస్తూ రిట్ ఆఫ్ మాండమాస్ ఇస్తున్నామని పేర్కొంది ఏపీ హైకోర్టు.
అయితే ఇలా రిట్ ఆఫ్ మాండమస్ ఇవ్వడం శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. చట్టాలు చేయడానికి శాసన వ్యవస్థకు రాజ్యాంగం అన్ని అధికారాలు ఇచ్చిందన్నారు. అలాంటప్పుడు శాసన వ్యవస్థ అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలోనూ ప్రభుత్వం చర్చించింది. హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకూ ఎందుకంటే.. గతంలో ఉన్న చీఫ్ జస్టిస్ పదవిలో ఉన్నంత కాలం తమకు న్యాయం జరగదన్న ఓ ప్రచారాన్ని పకడ్బందీగా చేశారు. కొత్త చీఫ్ జస్టిస్ వచ్చిన కొన్నాళ్లకు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సమావేశాల్లో మరోసారి మూడు రాజధానుల బిల్లు పెట్టాలనుకుంటున్న ప్రభుత్వం.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంలో స్టే వస్తే ఆ పని పూర్తి చేయాలనుకుంటోంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా సవాల్ చేస్తే నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ పిటిషన్ ఎప్పటికి విచారణకు వస్తుందో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.