వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్నాళ్ల క్రితం జాబ్ మేళాలు నిర్వహించారు. జాతీయ , అంతర్జాతీయ కంపెనీలు వచ్చి ఉద్యోగాలిచ్చాయని ప్రచారం చేసుకున్నారు. కానీ అక్కడ ఎక్కువగా ఇచ్చింది సెక్యూరిటీ ఉద్యోగాలు. అతి తక్కువ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు. ఇలా ఇచ్చిన సాఫ్ట్ ఉద్యోగాలన్నీ ఫేక్ అని..మోస పూరితం అని పోలీసు కేసులు నమోదవుతున్నాయి. విశాఖలో విజయసాయి నిర్వహించిన జాబ్ మేళాలో ఓ చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ రిక్రూట్ మెంట్లు నిర్వహించింది. విజయసాయి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు.
అయితే ఆ కంపెనీ రూ. ముఫ్పై వేల డిపాజిట్ కట్టాలని షరతు పెట్టింది. చాలా మంది కట్టారు. ట్రైనింగ్ ఇస్తామని చెప్పిన కంపెనీ పట్టించుకోలేదు. తర్వాత జీతాలివ్వడం కూడా మానేశారు. దీంతో చూసి చూసి .. వారు మీ ఉద్యోగం వద్దు.. ట్రైనింగ్ వద్దు.. మా డబ్బులు మాకిచ్చేయమని అడిగారు. కానీ ఆ కంపెనీ యజమానులు మాత్రం బెదిరించి పంపేశారు. దీంతో ఆ ఉద్యోగులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. విశాఖలో ఇలాంటి కంపెనీలు రెండు వెలుగు చూశాయి. విజయసాయిరెడ్డి నిర్వహించి జాబ్ మేళాలో జరిగిన మోసాన్ని బయట పెట్టాయి.
విశాఖతో పాటు గుంటూరు, తిరుపతిల్లోనూ విజయసాయిరెడ్డి జాబ్ మేళాలు నిర్వహించారు. అప్పట్లో ఆయా చోట్ల సెక్యూరిటీ గార్డులు.. ఫ్యాక్టరీలో హెల్పర్ల ఉద్యోగాలే ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు విశాఖలో వ్యవహారాలు బయటకు రావడంతో ముందు ముందు ఆ రెండు జాబ్ మేళాల్లో పాల్గొన్న కంపెనీల గుట్టు బయటకు వచ్చే అవకాశం ఉంది.