సీపీఎస్ రద్దు అంశం ఏపీ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. వారం రోజుల్లో రద్దే అన్న సీఎం అడ్డంగా మడమ తిప్పారు. ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగుల్ని ఎలా సముదాయించాలా అని చూస్తున్నారు. సీపీఎస్ రద్దు అసాధ్యమంటున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు రద్దు చేసి చూపించాయి. దీంతో సీపీఎస్ రద్దు డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఆశలు పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే బాట పట్టారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకు రావాలని వారు రోడ్డెక్కారు.
అయితే అక్కడ ఉద్యోగ సంఘం నాయకులు ఏపీ ఉద్యోగ నేతల్లా లేరు. అనుకున్నట్లుగా ఉద్యోగులందర్నీ సమ్మెలోకి తీసుకెళ్లారు. సీపీఎస్ వల్ల ప్రధానంగా ప్రభావితమైన ఉద్యోగులు విద్యాశాఖలో ఎక్కువగా ఉండటంతో టీచర్లంతా మూకుమ్మడిగా సెలవు పెట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు కార్యాలయాలను మూసేయాల్సి వచ్చింది. అక్కడ త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో సీపీఎస్ ఉద్యోగులు బరిలోకి దిగడంతో గుజరాత్ బీజేపీ సర్కార్‌కు టెన్షన్ ప్రారంభమయింది.
సీపీఎస్ రద్దు వద్దే వద్దని కేంద్రం చెబుతోంది . ఉద్యోగులు చెల్లిస్తున్న కాంట్రాబ్యూషన్ పై ప్రభుత్వాలకు అప్పులు కూడా ఇస్తోంది. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఏం చేస్తుందనేది కీలకంగా మారింది. అక్కడ అధికారం నిలబెట్టుకోవడం బీజేపీకి కీలకం. అధికారం కోసం సీపీఎస్‌ను రద్దు చేస్తే మాత్రం జగన్‌కు ఇబ్బందికరమే. ఆయన కూడా సీపీఎస్‌ను రద్దు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.