బీజేపీ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎంత కంగారు పడుతున్నారో ఆయన రాజకీయ వ్యూహాలే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏ రాజకీయం చేసినా టీఆర్ఎస్ ఎజెండా సెట్ చేసేది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ తనకు తెలియకుండానే బీజేపీని ఫాలో అయిపోతోంది. ఆ పార్టీ ఏం చేస్తుందో ముందే తెలుసుకుంటున్నారో.. బీజేపీ తెలిసేలా చేస్తోందో కానీ వెంటనే.. బీజేపీ కన్నా ముందే తాము ఆ కార్యక్రమం చేయడానికి వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి టీఆర్ఎస్ సీనియర్లలోనూ చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ నిజంగానే బీజేపీ ట్రాప్‌లో పడ్డారా అన్న సందేహం వారు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ చేస్తోందని విమోచనను సమైక్యత పేరుతో నిర్వహించేసిన కేసీఆర్
అధికారం చేపట్టిన ఎనిమిదేళ్లలో ఇంత వరకూ ఒక్క సారిగా విమోచన దినాన్ని టీఆర్ఎస్ నిర్వహించలేదు. కానీ బీజేపీ నిర్వహిస్తామనేసరికి నిర్వహించేశారు. దీంతో క్రెడిట్ బీజేపీకి వచ్చిందా.. టీఆర్ఎస్ కు వచ్చిందా అన్నది టీఆర్ఎస్ నేతలకు క్లారిటీ వచ్చేసింది. అంతకు ముందు స్వాతంత్ర వజ్రోత్సవాల విషయంలోనూ అదే జరిగింది. కేంద్రం అమృతోత్సవ్ నిర్వహించాలనుకుంటే … కేసీఆర్ సర్కార్ అంత కంటే ఘనంగా నిర్వహించింది. కానీ అలా చేయడం వల్ల బీజేపీ పేరే ఎక్కువగా ప్రజల్లో చర్చకు వచచింది.
బీజేపీకి మేలు చేసేలా స్వతంత్రంగా స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఏమీ చేయడం లేదని పదే పదే లేఖలు రాస్తున్నారు.. ఆరోపణలు చేస్తున్నారు కానీ ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదు . దీనికి కారణం బీజేపీతో సన్నిహితంగా ఉన్నంత కాలం ఉండి ఇప్పుడు రాజకీయం కోసం విమర్శలు చేస్తున్నరన్న అభిప్రాయం ప్రజల్లో బలపడటమే. ఇంత కాలం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ట్రెండ్ సెట్టర్. ఆయన ఏదైనా ఓ పొలిటికల్ అజెండా పట్టుకుంటే ఇతర రాజకీయ పార్టీలు తప్పనిసరిగా అనుసరించాల్సి వచ్చేవి. కానీ ఇప్పుడు బీజేపీ అజెండాను తనకు తెలియకుండానే కేసీఆర్ అునుసరిస్తున్నారు.
గిరిజన రిజర్వేషన్లను తెరపైకి తేవడం ఎవరికి నష్టం ?
గిరిజన రిజర్వేషన్లు… గిరిజన బంధు వంటి పథకాలను తెరపైకి తేవడం వల్ల కూడా టీఆర్ఎస్‌కే నష్టమని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇంత కాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎన్నికలకు ముందు తేవడం వల్ల గిరిజనుల్లోనూ నమ్మకం పోతుందని అంటున్నారు. కేంద్రం అనుమతి లేకుండా జీవో ఇచ్చి గిరిజనులతో రాజకీయం చేయడం తప్ప ప్రయోజనం ఏముంటుందని అంటుందని అంటున్నారు. అదే సమయంలో గిరిజన బంధును కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేరని.. లబ్దిదారులు తప్ప అందరూ వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.