ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు అంటే రాజకీయ నేతలకు అదో హోదా లాంటిది. అలాంటి కేసులు లేకపోతే రాజకీయ నాయకులు కాదన్నట్లుగా ఉంటారు కొంత మంది. అలాంటిది మోహన్ బాబు మాత్రం ఆ కేసుకే హైరానా పడిపోతున్నారు. కోర్టుకు హాజరు కావడం లేదు. ఇప్పుడు అసలు ఆ కేసు విచారణ వద్దని ఆయన నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎనిమిది వారాల పాటు కేసు విచారణను నిలిపివేసింది.
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ 2019 ఎన్నికలకు ముందు తన కాలేజీ విద్యార్ధులతో కలిసి మోహన్ బాబు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆందోళన చేసినందుకు గాను మోహన్ బాబుతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణకు హాజరుకాకపోవడంతో సమన్లు జారీ అయ్యాయి. చివరికి గత జూన్లో కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన పాదయాత్ర చేస్తూ కోర్టుకు రావడం వివాదానికి కారణం అయింది. ఆ సమయంలో కోర్టు బయట మీడియాతో తాను బీజేపీ మనిషినని అవసరం లేకపోయినా చెప్పుకున్నారు. జూన్ తర్వాత మళ్లీ కేసు విచారణకు మోహన్ బాబు హాజరు కాలేదు. అయితే మళ్లీ వాయిదాలు ఉండటంతో కేసు విచారణ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ధర్నా చే్యడంతోనే సమస్య వచ్చింది. ఆ ధర్నా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీకి విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే.. మోహన్ బాబు మాత్రం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.