షెడ్డుకెళ్లిపోయిన మార్గదర్శి కేసులో ఈకలు పీకడానికి ఉండవల్లి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రామోజీరావుపై కేసులంటే ఇష్టపడే జగన్‌ను ఒప్పించి.. సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లగలిగారు. అయితే విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక్కటే అడిగింది. మార్గదర్శి కేసులో అందరికీ చెల్లింపులు చేశారా లేదా అని ప్రశ్నించింది. చేశారని చెప్పడానికి మనసు రాని ఏపీ ప్రభుత్వ లాయర్.. అదనపు సమయం కావాలని అడిగారు. దాంతో నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది.
అయితే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీడ్ చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. కోర్టు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. నిజానికి ఈ కేసును తెలంగాణ హైకోర్టు చాలా కాలం కిందట కొట్టి వేసింది.త కానీ ఏమీ దొరక్క ఈ కేసును మళ్లీ సుప్రీంకోర్టు వరకూ తీసుకు వచ్చింది. మార్గదర్శి కేసులో వివాదాలు ఎందుకని రామోజీరావు డిపాజిట్ దారులందరికీ చెల్లించేశారు. ఇందుకోసం తన మీడియా వ్యాపారాన్ని తెలుగు మినహా ఇతర భాషల చానళ్లను రిలయన్స్‌కు అమ్మేశారు.
ఆ డబ్బులతో అందరికీ చెల్లించేశారు. ఒక్కరంటే ఒక్క బాధితుడూ మార్గదర్శి మీద ఫిర్యాదు చేయలేదు. అయినా సరే రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి కేసుల కోసం ఖర్చు పెట్టుకుని మరీ ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం బాధితులు ఉన్నారని చెబుతుందా.. లేకపోతే బాధితులుగా ఎవరినైనా తెరమీదకు తెస్తుందా అన్నది చూడాల్సి ఉంది.