ఏపీలో పెద్ద ఎత్తున ప్రభుత్వ పెద్దల సహకారం పొంది.. రూ. ఐదు వందల కోట్లకుపైగా కాంట్రాక్ట్ పొందిన బైజూస్.. తెలంగాణలో మాత్రం ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ట్యాబ్లెట్స్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ ట్యాబ్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వీటిని బైజూస్ ఉచితంగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇంటర్ మెటీరియల్‌తో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమాచారం కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గతంలో కేటీఆర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అందుకే తన హామీని నెరవేర్చుకునే సమయం ఆసన్నం కావడంతో సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్‌ను తానే స్వయంగా పంపిణీ చేస్తానని కేటీఆర్ తెలిపారు. ట్యాబ్లెట్స్ రెడీ అయ్యాయని.. ఈ వారంలోనే పంపిణీ చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఏపీలో మాత్రం ఇంకా పంపిణీకి ముహుర్తం ఖరారు కాలేదు.
ఆన్ లైన్ క్లాసులు జరిగినప్పుడు బైజూస్ కు మంచి వ్యాపారం జరిగింది. కానీ క్లాసులు ప్రారంభం కావడంతో బైజూస్ కంటెంట్ ను కొనేవారు లేరు. చాలా స్కూళ్లు కూడా ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నాయి. దీంతో బైజూస్ వ్యాపారం భారీగా పడిపోయింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో బైజూస్ కొత్త వ్యాపార అవకాశాలను చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.