మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు ..? ఈ ప్రశ్న బీజేపీ నేతలకూ పజిల్‌గా మారింది. దీనిపై అమిత్ షా తన పర్యటనలో క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. వచ్చే నెలాఖరులో షెడ్యూల్ రావొచ్చని ఆయన సంకేతాలిచ్చారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎన్నికల కమిషన్ ఒక స్థానం ఖాళీ అయితే ఆర్నెళ్లలోపు ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశ వ్యాప్తంగా ఏమైనా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే వాటితోపాటు కలిపి ఎన్నికలు నిర్వహిస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ లో జరగాలి.
ఈసీ అనుకుంటే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే మునుగోడు ఉపఎన్నికలు కూడా జరుగుతాయి. అయితే అది మరీ ఆలస్యం. అందుకే ఉపఎన్నికల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చే చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే నెల అంటే అక్టోబర్ చివరిలో షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని చెబుతున్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు పార్టీ నేతలకు సూచనలిచ్చారని చెబుతున్నారు.
కానీ ఆయన కూడా ఉపఎన్నిక ఎప్పుడు ఉంటుందని చెప్పలేదు. అయితే ఈసీ వైపు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు అంతర్గతంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయం. అందులో కేంద్రానికి కానీ ఇతర పార్టీలకు కానీ చాయిస్ ఉండదు. అయితే అనధికారికంగా ఈసీపై కేంద్రంపై పట్టు ఉంది. బీజేపీ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ ఉంది. అందుకే బీజేపీ ఎప్పుడు ఉపఎన్నిక కావాలని అనుకుంటే అప్పుడు ఈసీ షెడ్యూల్ ఖరారు చేస్తుంది.