ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు చేస్తున్న దర్యాప్తు.. వారు ఇస్తున్న లీకులు టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో అతి సన్నిహిత సంబంధాలు ఉన్న వారి ఆఫీసులు, నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఈ నెలలో రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు రెయిడ్ చేసిన ఈడీ టీమ్‌లు పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నాయి. ఒక టీమ్‌లో ఉన్న సిబ్బందిని మరోసారి ఇంకో టీమ్‌లోకి మారుస్తూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచడంతో పాటు పలు వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆదాయ వివరాలను పరిశీలించేందుకు ఐటీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ కంపెనీలపై ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇప్పుడు లిక్కర్ స్కాం వ్యవహారంలో ఐటీ సహకారాన్ని ఈడీ కోరింది. వెన్నమనేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న సంస్థలు అన్నీ సూట్ కేసు కంపెనీలేనని.. కేవలం మనీ లాండరింగ్ కోసం వాడుకుంటున్నారని గట్టి ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. ఆయన కంపెనీల ద్వారా రూ. రెండువందల కోట్లు ఆప్ కు చేరాయని చెబుతున్నారు.
ఈడీ దాడులపై టీఆర్ఎస్ గుంభనంగా వ్యవహరిస్తోంది. కవితకు నోటీసులు వచ్చాయన్న ప్రచారంపై ఆమె మాత్రమే స్పందించారు. ఇతరులెవరూ స్పందించడం లేదు. ఈ అంశంపై మాట్లాడవద్దని టీఆర్ఎస్ హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కేసీఆర్ కుమార్తె కవితను టార్గెట్ చేసినట్లుగా మొదటి నుంచి తెలుస్తూనే ఉంది. సున్నితమైన విషయం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఇది ఆషామాషీ కాదని.. సంచలనాలు ఉంటాయని నమ్ముతున్నారు.