రాజకీయాలు తనకు దూరం కాలేదంటూ చిరంజీవి చెప్పిన సినిమా డైలాగ్ నిజం. ఎందుంటే ప్రతీ రోజూ ఆయన జపం చేయనిదే వైసీపీలాంటి పార్టీలకు పూట గడవు. పవన్ కల్యాణ్ ఫీవర్‌తో చిరంజీవి ద్వారా బయటపడాలనుకుంటున్న వైసీపీ.. ఆయనను మొహమాట పెడుతోంది. ఆయనకు తోడు బీజేపీ కూడా.. అదే పనిలో ఉంది. అందకే చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యారు కానీ.. రాజకీయాలు ఆయనకు దూరం కాలేదు.
చిరంజీవికి ఓ రాజ్యసభ సీటిచ్చి తమ గుప్పిట్లో ఉంచేసుకోవాలని గతంలో వైసీపీ చాలా ప్రయత్నించింది. చిరంజీవి ఒక్కడినే విందుకు పిలిచి.. వైఎస్ భారతి కొసరి కొసరి వడ్డించి.. మరీ మర్యాదలు చేశారు. ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు విమానం ఎక్కగానే… వైసీపీలోకి చిరంజీవి.. రాజ్యసభ సీటు ఆఫర్ అనే ప్రచార చేశారు. కానీ చిరంజీవి కొట్టి పడేశారు. భారతి గారు వడ్డించిన వంట బాగుందని మెచ్చుకున్నారు. అయితే చిరంజీవి తమ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి పవన్‌కు కౌంటర్ ఇవ్వడానికి ఆయనను వాడేసుకుంటూ ఉంటుంది.
బీజేపీ కూడా చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత సోము వీర్రాజు మొదట చిరంజీవితోనే భేటీ అయ్యారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆప్యాయంగా చిరంజీవితో మాట్లాడారు . అప్పుడు కూడా చిరంజీవి – బీజేపీ అనే ప్రచారం ఊపందుకుంది. కానీ చిరంజీవి గుంభనంగా ఉండిపోయారు.
పైకి చెప్పకపోయినా సోదరుడివైపే చిరంజీవి ఉంచారు. చిరంజీవి సోదరుడి గురించి వ్యక్తిగతంగా స్పందిస్తూంటారు. పవన్ అనుకున్నది సాధిస్తారని చెబుతూంటారు. అయితే చిరంజీవి నేరుగా చెప్పినా చెప్పకపోయినా జనసేన పార్టీకే ఆయన మద్దతు ఉంటుందనేది బహిరంగరహస్యం. ఎలా చూసినా నిజంగానే చిరంజీవి రాజకీయాల్ని వద్దనుకున్నారు. దూరంగా ఉన్నారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనను వదిలి పెట్టలేదు.