ఏపీలో వైద్య విద్య అంతా వైఎస్, ఆయన కుమారుడినైన తనదయేనని.. అందుకే హెల్త్ యూనివర్శిటీ పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టాలని నిర్ణయించామని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అసలు వైఎస్ సీఎం కాక ముందు ఏపీలో వైద్య విద్య లేనట్లుగా.. జగన్ రాక ముందు మెడికల్ కాలేజీలే లేవన్నట్లుగా ఆయన మాట్లాడిన వైనం.. అసెంబ్లీలో అందర్నీ ఆశ్చర్య పరిచింది. పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెడుతున్నానని జగన్ శంకుస్థాపనలు చేశారు. వాటిలో మూడింటికి మాత్రమే అనుమతులు వచ్చాయి. అందులో ఒక్క పులివెందులలో మాత్రమే పునాదులు దశ దాటాయి. కానీ మొత్తం పెద్ద ఎత్తున కాలేజీలు పెట్టేసినట్లుగా జగన్ చెప్పుకున్నారు.
‘‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు రూపొందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. స్వయంగా డాక్టర్ అయిన ఆయన ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 8 మెడికల్ కాలేజీలు టీడీపీ పుట్టకముందే, 1983 కన్నా ముందే స్థాపితం అయ్యాయి. మిగతా 3 మెడికల్ కాలేజీలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెలకొల్పారు. ఇప్పుడు నా హాయాంలో మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. మొత్తంగా 27 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్ఆర్ వల్లనో, ఆయన కొడుకు అయిన నా వల్లనో ఏర్పాటు అవుతున్నాయి. 1983 నుంచి ఇప్పటిదాకా టీడీపీ హాయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మితం కాలేదు.’’ అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఆయనకు ఇతరులు నిర్మించినవి.. ఏవీ కనిపించవు. బోర్డులు పెట్టేసుకుని అన్నీ తమ ఘనతే అని చెప్పుకోవడం బాగా అలవాటైపోయిందన్న అభిప్రాయం ఈ మాటలు వింటే ఎవరికైనా అర్థమైపోతుంది.
బాబాయ్‌ను ఘోరంగా హత్య చేశారని తెలిసినా…హంతకుల్ని కాపాడుతూ… ఆయన జయంతి, వర్థంతికి కూడా కన్నీరు పెట్టుకుని ఆయనంటే తనకు ఎంతో మమకారమని చెప్పుకున్న జగన్ అదే తరహా నటన అసెంబ్లీలోనూ చూపించారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో మమకారం ఉందన్నారు. చంద్రబాబు కంటే ఎక్కువ అభిమానం ఉందన్నారు. ఎన్టీఆర్‌ను తాను ఒక్క మాట అనలేదున్నారు. ఈ నిర్ణయం తీసుకొనే ముందు తనను తాను కూడా చాలాసార్లు ప్రశ్నించుకున్నానని, అన్నీ కరెక్ట్ అని అనుకున్నాకే ముందడుగు వేసినట్లుగా చెప్పారు.