హీరోలకు కథలు చెప్పడంలో చాలా మార్గాలున్నాయి. పెద్ద హీరోలైతే నేరుగా కథలు వినరు. మేనేజర్లకు లేదంటే అసిస్టెంట్లకు చెప్పమంటారు. బాగుంటే.. అప్పుడు హీరో రంగంలోకి దిగుతాడు. దాదాపు అందరు హీరోలకూ ఇలాంటి ఓ కోటరీ ఉంది. ఎందుకంటే వచ్చిన ప్రతీ కథనీ వినేంత ఓపిక, తీరిక ఏ హీరోకూ ఉండదు.విజయ్ దేవరకొండకు కథ చెప్పాలన్నా ఇంతే. కాకపోతే ఈమధ్య విజయ్ తండ్రి వర్థన్… ఇప్పుడు ఈ కోటరీలో వచ్చారని, విజయ్‌కి కథ చెప్పాంటే ముందు వర్థన్‌కి వినిపించాలని, ఆయన ఓకే అంటేనే ఆ కథ విజయ్ వరకూ వెళ్తోందని ఓ ప్రచారం మొదలైంది. హీరోల కథలు వాళ్ల తండ్రులు వినే సంప్రదాయం.. ఇప్పటి వరకూ లేదు. స్టార్ హీరోల కొడుకులు హీరోలైతే… కథలు వినే బాధ్యత ఆయా హీరోలు తీసుకుంటారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన విజయ్ లాంటి హీరోల విషయంలో ఇదో కొత్త ట్రెండ్ అనుకోవాలి. ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో అప్పటి నుంచీ వర్థన్‌కు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయట. ‘మా దగ్గర కథ ఉంది.. ముందు మీరు విని.. ఆ తరవాత విజయ్‌కి చెప్పండి’ అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారట. ఈ విషయమై వర్థన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. తెలుగు 360తో వర్థన్ మాట్లాడారు.
”విజయ్ కథలన్నీ నేను వింటున్నాను అనడంలో ఎలాంటి వాస్తవం లేదు. విజయ్ కి కథలపై మంచి జడ్జిమెంట్ ఉంది. తన కథలన్నీ స్వయంగా తనే వింటాడు. ఎప్పుడైనా ఆ కథల గురించి నాతో చర్చిస్తాడంతే. విజయ్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు, దర్శకులకూ నాకంటే కథల గురించి బాగా తెలుసు. అందుకే ఇందులో నా ప్రమేయం ఏమీ ఉండదు” అని తేల్చేశారు.