కేసీఆర్ జాతీయ రాజకీయాలు పట్టాలెక్కడం లేదు. ఆయన కలిసిన వారంతా వేరే పార్టీలతో టచ్‌లోకి వెళ్లిపోతున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా.. జాతీయ కూటమి పెట్టినా నితీష్ కలిసి వస్తారని అనుకున్నారు. కానీ ఆయన హఠాత్తుగా రాహుల్, సోనియాలను కలుస్తానని ప్రకటించారు. వారితో కలిసి పని చేసేందుకు సిద్ధమంటున్నారు. అంటే నితీష్ కుమార్ .. మూడో కూటమి లేదా కేసీఆర్ ప్రతిపాదించబోయే జాతీయ వేదిక వంటి వాటిపై ఆయన ఆసక్తిగా లేనట్లే.
ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రత్యామ్నాయ నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. కానీ ఆమె జాతీయ రాజకీయాల గురించి మాట్లాడం మానేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ చాలా మంచి వారని.. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వెనుక ఆయన హస్తం లేదని సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీపై యుద్ధానికి కేసీఆర్‌తో కలిసి వచ్చే వారు దాదాపుగా లేరు. ఇటీవల కేసీఆర్‌ను కలిసిన వారిలో కర్ణాటక నేత కుమారస్వామి రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఓ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకపోతే.. మొత్తానికే నష్టపోయే సూచనలు ఆ పార్టీకి ఉన్నాయి. గుజరాత్ నుంచి వచ్చి కలిసిన శంకర్ సింగ్ వాఘేలా రాజకీయంగా ఎలాంటి ప్రభావమూ చూపే పరిస్థితిలో లేరు.
దసరాలోపే ముహుర్తం అని చెబుతున్నారు. వారం రోజుల కిందట హడావుడి చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయిపోయారు. అందుకే ఆయన రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లవచ్చని చెబుతున్నారు. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు పెరగడం.. మరో వైపు జాతీయ రాజకీయాల పరంగా ఏదీ కలసి రాకపోవడం కేసీఆర్‌కు సవాళ్లుగా మారాయి. కానీ కేసీఆర్ ముందుకే వెళ్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.