చిరంజీవి, సల్మాన్ ఖాన్… ఇద్దరూ సూపర్ స్టార్లు. ఒకరు బాలీవుడ్ ని ఏలితే… ఇంకొకరు టాలీవుడ్ నెంబర్ వన్. ఇద్దరూ కలిసి స్టెప్పెస్తే…? ఆ మజానే వేరు. `గాడ్ ఫాదర్`ఆ అవకాశం కల్పించింది. చిరంజీవి కథానాయకుడిగా నటించిన గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరు,సల్మాన్‌లపై `తార్ మార్ తక్కెడమార్` అనే పాట రూపొందించారు.ముంబైలో ప్రభుదేవా డైరెక్షన్ లో ఈ పాటని చిత్రీకరించారు. బుధవారం పాట కూడా విడుదలైంది. ఈ పాటని సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆశ పడుతున్నారు.
అయితే ఈ పాట సినిమాలో ఉండదు. కేవలం ఎండ్ టైటిల్స్ కోసం మాత్రమే రూపొందించారు. సినిమాలో.. ఎక్కడా సందర్భం కుదరకపోవడంతో చివర్లో ప్లే చేయాల్సివస్తోందట. ఇద్దరు సూపర్ స్టార్ల పాట ఎండ్ టైటిల్స్ లో పెట్టడం నిజంగానే.. నిరుత్సాహ పరిచే విషయం. ఈమధ్య లైగర్‌లో కూడా ఇదే జరిగింది. ఓ మంచి పాటకు సరైన ప్లేస్ మెంట్ ఇవ్వలేక.. ఎండ్ టైటిల్స్ లో ఇరికించేశారు. అప్పటికే ఆ సినిమా రిజల్ట్ తేలిపోవడంతో ఆ పాటని ఎవరూ పట్టించుకోలేదు. సినిమా బాగుంటే ఎండ్ టైటిల్స్ ని కూడా జనాలు ఎంజాయ్ చేస్తారు. తేడా కొడితే మాత్రం చిరు,సల్మాన్‌లు కాదు కదా, దేశంలోని సూపర్ స్టార్లంతా కలిసి స్టెప్పులేసినా ఎవరూ పట్టించుకోరు. చిరు,సల్మాన్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి చిందేయడం అరుదైన సీనే. దానికి సినిమాలో ప్లేస్ మెంట్ దొరక్కపోవడం మాత్రం బ్యాడ్ లక్.