ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’, శ్రీవిష్ణు ‘అల్లూరి’లపై ఫోకస్ ఎక్కువగా ఉంది. రెండు సినిమాలూ బాగానే పబ్లిసిటీ చేసుకొన్నాయి. రెండు సినిమాల ట్రైలర్లూ.. ఆకర్షిస్తున్నాయి. ఇద్దరూ మీడియం రేంజు హీరోలే. ఇద్దరికీ ఇప్పుడు హిట్టు కొట్టాల్సిన అవసరం ఉంది. ఛలో తరరవాత శౌర్యకు ఆ రేంజ్ హిట్టు పడలేదు. తాను కష్టపడి, ఇష్టపడి చేసిన ‘అశ్వద్ధామ’, ‘లక్ష్య’ చిత్రాలు దారుణంగా బెడసి కొట్టాయి. పైగా ఇది శౌర్య సొంత బ్యానర్లో చేస్తున్న సినిమా. తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ ని ఎంచుకొన్నాడు. యూత్‌కి నచ్చితే.. శౌర్యకు హిట్ నల్లేరుపై నడకే.
ఓ హిట్టూ, మూడు ఫ్లాపులూ అన్నట్టు సాగుతోంది శ్రీవిష్ణు కెరీర్. ‘బ్రోచేవారెవరురా’ తరవాత వరుసగా అన్నీ ఫ్లాపులే. `రాజ రాజ చోర` మళ్లీ ఊపిరి పోసింది. ఆ తరవాత వచ్చిన `భళా తందనాన` డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పుడు `అల్లూరి`పై భారీగా ఆశలు పెట్టుకొన్నాడు. తన కెరీర్లో తొలిసారి పోలీస్ పాత్ర పోషించిన చిత్రమిది. ఈ కథ తన కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లపై కూడా ఇదివరకెప్పుడూ లేనంత శ్రద్ధ పెట్టాడు శ్రీవిష్ణు, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అల్లు అర్జున్ ని తీసుకొచ్చి, హైప్ పెంచే ప్రయత్నం చేశాడు. పోలీస్ కథలు సక్సెస్ఫుల్ ఫార్ములానే. కాకపోతే. అందులోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలి. మరి.. శ్రీవిష్ణు ఏం చేశాడో..? వీరిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకొన్న ఈ రెండు సినిమాల జాతకం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.