తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరాటం పెరిగిపోయింది. ఈటల రాజేందర్ ను బండి సంజయ్ వర్గం పూర్తి స్థాయిలో దూరం పెడుతోంది. తెలంగాణ బీజేపీలో రెండే రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారం మొదటి నుంచి సాగుతూనే ఉంది. అందులో ఒకటి బండి సంజయ్ వర్గం అయితే మరొకటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్గం . మొదటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బీజేపీలో ఎక్కువగా బండి సంజయ్‌కు ఫాలోయింగ్ ఉందనేది కాదనలేని సత్యం. కిషన్‌రెడ్డి బండి సంజయ్కంటే సీనియర్.
బండి సంజయ్ మొదటి సారి ఎంపీగా గెలిచారు. అయినా తన హవా మాత్రం తగ్గించకుండా దూసుకుపోతున్నారు. తెలంగాణలో వరుస విజయాలు.. పాదయాత్రతో హైకమాండ్ దృష్టిలోనూ బలమైన నేతగా గుర్తింపు పొందారు బండి సంజయ్. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ .. హుజూరాబాద్ గెలుపుతో కేసీఆర్ ను ఢీకొట్టి గెలిచిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన కూడా బీసీ నేతగా సరైన గుర్తింపు కోరుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన బండి సంజయ్.. తనకు పోటీగా మరో నేత రావడం భరించలేకపోతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీలో నేతలపై కొన్ని సార్లు బండి సంజయ్ చేసిన కామెంట్లు ఈటల గురించేనని చెబుతూంటారు. ఈటల చేరిక కమిటీ చైర్మన్‌గా ఉన్నా.. ఆయన దగ్గరకు రాకుండానే బండి సంజయ్ పలువురున్ని తీసుకెళ్లి బీజేపీలో చేర్పించారు. ఇలాంటివి జరుగుతూండటంతో బీజేపీలో వర్గ పోరాటం వెలుగులోకి వస్తోంది. ఈ అంశం హైకమాండ్‌కు కూడా చేరడంతో ఈటలను ఎందుకు ఇటీవల సమావేశంలో మండి పడినట్లుగా తెలుస్తోంది . అయినా ఈటల ఆ పార్టీలో ఇప్పటికీ ప్రత్యేకమైన నేతగానే ఉండిపోతున్నారు.