కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. కాంగ్రెస్‌లో ఉంటానంటున్నారు..కానీ పార్టీ నేతలను సస్పెండ్ చేయాలంటూ వరుసగా హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని పీసీసీగా తీసేయాలని ఆయన చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు. అద్దంకి దయాకర్ పైనా అంతే విరుచుకుపడ్డారు. ఇప్పుడు షబ్బీర్ అలీ వంతు. ఆయనను రేపోమాపో అరెస్ట్ చేస్తారని అర్జంట్‌గా పార్టీ నుంచి తొలగించాలని సోనియా గాంధీకి లేఖ రాశారు.
చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖలో తెలిపారు. షబ్బీర్‌ను అరెస్ట్ చేస్తే పార్టీ పరువు పోతుందని చెప్పారు. షబ్బీర్ ను ఇంకా పార్టీలోనే కొనసాగిస్తే ఆయన వల్ల పార్టీకి నష్టం జరగవచ్చని కూడా కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.షబ్బీర్ అలీని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ప్రియాంకా గాంధీని కోరారు. హఠాత్తుగా షబ్బీర్ అలీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురి పెట్టడం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశమవుతోంది.
నిజానికి షబ్బీర్ అలీ ఇటీవలి కాలంలో వివాదాస్పదం కాలేదు. ఆయనపై కేసులు సంచలనం కాలేదు. ఆ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి పార్టీ హైకమాండ్ నిర్వహించిన అభిప్రాయసేకరణలో షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు. రేవంత్ తరపున యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయనను టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు. పార్టీలోనే ఉంటానంటున్నకోమటిరెడ్డి.. తనకు పదవి రాకుండా అడ్డు పడిన వారిపై ఫిర్యాదులు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.