పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్‌తో దర్శకుడిగా తనని తాను నిరూపించుకొన్నాడు… సాగర్ చంద్ర. ఓ సూపర్ హిట్ సినిమా రీమేక్ ని తెరకెక్కించడం ఒక ఎత్తయితే, పవన్ కల్యాణ్ అభిమానుల అంచనాల్ని అందుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో సాగర్ చంద్రకు పూర్తి మార్కులు పడ్డాయి. త్రివిక్రమ్ నీడలో కూడా… తన ఉనికిని చాటుకొన్నాడు సాగర్. అయితే… ఆ హిట్ కి తగిన ప్రతిఫలం రాలేదు. సాగర్ చంద్ర తదుపరి సినిమాపై ఇప్పటి వరకూ స్పష్టమైన ప్రకటన రాలేదు. ఫలానా హీరోతో సాగర్ చంద్ర సినిమా ఉందంటూ గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే అవేం ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… సాగర్ చంద్ర ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే బెల్లంకొండకు కథ చెప్పేశాడని, బెల్లంకొండ కూడా ఓకే చేశాడని వార్తలొస్తున్నాయి. బెల్లంకొండ ప్రస్తుతం `ఛత్రపతి` రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తెలుగులో కొత్తగా రెండు సినిమాలు చేయడానికి అంగీకరించాడని టాక్. అందులో సాగర్ చంద్ర సినిమా ఒకటి. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.